గుహలోని పిల్లలని ఒకేసారి తీసుకురాలేము
– వారిని తీసుకొచ్చేందుకు మరికొన్ని వారాలు పడుతుంది
– వెల్లడించిన థాయ్ అధికారులు
థాయ్‌లాండ్, జులై5(జనం సాక్షి) : థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకుపోయిన చిన్నారులందరినీ ఒకేసారి బయటకు తీసుకురావడం కుదరదని థాయ్ అధికారులు వెల్లడించారు. వారిని విడతల వారీగా తీసుకొస్తామని అన్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంత కొంత మందిని గుహలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత థాయ్ లుయాంగ్ గుహలో 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్ కోచ్ చిక్కుకుపోయి తొమ్మది రోజుల తర్వాత ఆచూకీ లభ్యమైన సంగతి తెలిసిందే. చిన్నారులు సురక్షితంగా ఉన్నప్పటికీ బాగా నీరసించి ఉండడంతో వైద్యులు వారికి తగిన ఆహారం ఇస్తున్నారు. అయితే గుహలో నీటిమట్టం, బురద బాగా పెరగడంతో పాటు కొన్ని కిలోవిూటర్ల లోపల ఇరుకైన ప్రాంతంలో ఇరుక్కుపోవడం, పిల్లలెవరికీ ఈత రాకపోవడం వల్ల వారిని గుహలోంచి బయటకు తీసుకొచ్చేందుకు మరికొన్ని వారాల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అలాగే గుహ వెలుపల నీటిమట్టం తగ్గించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో గుహలోని పదమూడు మందినీ ఒకే సారి తీసుకురావడం సాధ్యపడదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు పూర్తి ఆరోగ్యంతో సిద్ధంగా ఉన్న వారిని తొలుత బయటకు తీసుకొస్తామని చెప్పారు. ప్రతి రోజు పరిస్థితులను అంచనా వేసి, ఏదైనా సమస్య ఉంటే ముందుకు వెళ్లకుండా ఆగిపోతాం’ అని ఓ అధికారి తెలిపారు. నేవీ బుధవారం విడుదల చేసిన తాజా వీడియోలో చిన్నారులు నవ్వుతూ కనిపించారు. తాము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు. కొందరు గజ ఈతగాళ్లు, వైద్యులు వారితోనే ఉన్నారు. జూన్ 23న కనిపించకుండా పోయిన వీరిని సోమవారం రాత్రి ఇద్దరు బ్రిటిషు గజ ఈతగాళ్లు కనిపెట్టారు.
గుహలో చిక్కుకున్న వారిని నేను కాపాడతా..
థాయ్‌లాండ్‌లోని ఓ భారీ గుహలో చిక్కుకున్న 12మంది బాలురను, ఫుట్‌బాల్ కోచ్‌ను బయటకు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని మెక్సికోలో 69 రోజులు భూగర్భంలోనే జీవితం గడిపిన మారియో సెపుల్‌వేదా తెలిపారు. 2010లో మారియోతో పాటు మరో 32 మంది దాదాపు 10 వారాల పాటు సాన్ జోన్స్ బంగారం రాగి గనులలో గడిపారు. ఎట్టకేలకు వారు ఒక్కొక్కరుగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అప్పట్లో మెక్సికోలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు థాయ్‌లాండ్‌లోనూ అదే పరిస్థితి. థాయ్‌లాండ్‌లోనే అతి పెద్ద గుహల్లొ ఇదొకటి. వరద నీరు వీరందరినీ దాదాపు 4 కిలోవిూటర్ల లోపలికి లాక్కెళ్లిపోయింది. అంతా 11 నుంచి 16 ఏళ్ల మధ్య వయసువారే. ఎట్టకేలకు బ్రిటిష్ గజ ఈతగాళ్లు వీరిని కనిపెట్టగలిగారు. వీరంతా ఓ పెద్ద మట్టి దిబ్బపై ఉన్నారు. ఇటువంటి సమయంలో వాళ్లని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం సహకరిస్తే నేను వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేస్తానని 40 సెకన్ల వీడియోలో మారియో తెలిపారు.
—————————-