గెలుపుపై ఆశావహుల్లో ఉత్కంఠ
రెబల్ అభ్యర్థులతో టిఆర్‌ఎస్‌లో టెన్షన్
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): తొలివిడత పంచాయతీ ఫలితాల్లో అత్యధికం గులాబీదళం కైవసం చేసుకోవడంతో రెండోదశలో బరిలో ఉన్న టిఆర్‌ఎస్ అభ్యర్థుల్లో విజయం తొణికిసలాడుతోంది. ప్రజలు తమనే ఆదరిస్తారన్న భరోసాతో ప్రచారం చేశారు. శుక్రవారం జరుగనున్న రెండోదశలో కూడా విజయం తమదే వరిస్తుందన్న భావనలో ఉన్నారు. అయితే రెబల్స్ కూడా బరిలో ఉండడంవారికి తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంతో రెండో విడతలో పోటీ పడుతున్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అనేక చోట్ల అధికార తెరాస పార్టీ అభ్యర్థులు గెలుపొందినప్పటికీ.. కొన్ని చోట్ల అదే పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థులు సర్పంచి పదవిని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తొలి విడత ఫలితాల్లో అనేక మంది అధికార పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ.. కొన్ని చోట్ల ఆ పార్టీకి చెందిన తిరుగుబాటుదారులు గెలిచారు. దీంతో ప్రస్తుతం పోటీలో అనేక మంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఓటర్లు ఎవరికి మద్ధతు ఇస్తారో తెలియక తికమకపడుతున్నారు. పోటీలో ఉన్న ప్రతి ఒక్కరికి విూకే ఓటు వేస్తామని చెబుతుండటంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఓటరు నాడి అంతుచిక్కక ఆందోళనకు గురవుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థులు మాత్రం తాము గెలిచాక అదే పార్టీలో కొనసాగుతామంటూ స్థానిక ఎమ్మెల్యేలకు హావిూ ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల సర్పంచి పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు ఎక్కువ మంది తెరాసకు చెందిన వారే కావడంతో ఎమ్మెల్యేలు సంపూర్ణంగా ఎవరికీ మద్ధతు తెలపడం లేదు. గెలిచి రావాలని సూచిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో తెరాస రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ నేతలు వారి మద్దతు దారులను గెలిపించుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. ఎలాగైనా సర్పంచి పదవిని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఓట్లను నోట్లతో కొనుగోలు చేస్తున్నారు.
అవసరాన్ని బట్టి ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొంటున్నారు. కొన్ని పంచాయతీల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం జోరుగా పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి విడత ప్రశాంతంగా నిర్వహించినట్లుగానే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ క్రతువును పూర్తిచేసేందుకు అధికారులు సంసిద్ధులయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సామగ్రిని సిద్ధం చేసిన అధికారులు గురువారం ఎన్నికలు జరిగే గ్రామాలకు బయలుదేరి వెళ్లనున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలతోపాటు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. రెండో విడత కోసం సాగిన ప్రచార పర్వం బుధవారం ముగిసింది. సమయం ముగిసిన తర్వాత ప్రచారం చేయకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ.. వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. సరైన నిఘా, పర్యవేక్షణ లేకపోవడంతో ఓటర్లను డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు.