గెలుపు గుర్రాల కోసం పరిశీలన
ఖమ్మం,నవంబర్ 22: జిల్లా కాంగ్రెస్‌లో ప్రజాదరణ కలిగిన గెలుపుగుర్రాలను ఎంపిక చేసే కసరత్తు త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం – మహబూబాబాద్ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌లో హడావుడి మొదలైంది. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కోసం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయసేకరణ జరగబోతుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బలరాంనాయక్ పోటీ-చేశారు. బలరాం నాయక్ విజయం సాధించగా రేణుకాచౌదరి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఇటీవలే ఎంపిక అయ్యారు.అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి మళ్లీ తానే పోటీ- చేస్తానని ఇటీవల జిల్లాకు వచ్చినప్పుడు రేణుక ప్రకటించుకున్నారు. జిల్లాలో ఈ ఇద్దరు అభ్యర్థులకు మెజార్టీ నాయకులు మద్దతు తెలిపే అవకాశం కన్పిస్తోంది. రేణుకాచౌదరి పోటీ-చేయనని చెప్పిన పక్షంలో కొత్త పేర్లపై అభిప్రాయసేకరణ సాగే అవకాశం ఉంటుంది. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పినపాక, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. అక్కడ నుంచి ఎంపీగా గెలిచిన బలరాంనాయక్ ఇటీవలేకేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రిగా పదోన్నతి పొందారు. మహబూబాబాద్ టికెట్ మళ్లీ తనకే ఖాయమని భరోసాగా ఉన్నారు.