గొర్రెలకు నట్టల మందు పంపిణీ
కామారెడ్డి,జూన్20(జనం సాక్షి ): గొర్రెలు పరిపుష్టిగా ఉండాలంటే వాటికి నట్టల మందు తప్పనిసరిగా తాగించాలని జిల్లా పశువైద్యాధికారి రమేష్‌కుమార్ అన్నారు. బుధవారం సదాశివనగర్ మండలకేంద్రంలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలో మూడుసార్లు నట్టల మందు తాగించడం వల్ల గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. తొలకరి జల్లులు కురిసిన తర్వాత తాగిస్తే పరాన్నజీవులు తగ్గే వీలుందన్నారు. 3 నెలలు దాటిన పిల్లలకు మొదటగా నట్టల మందు తాగించాలన్నారు. గొర్రెల పెంపకందారులు అజాగ్రత్తగా ఉంటేమృత్యువాత పడే ప్రమాదముందని హెచ్చరించారు. పరాన్నజీవుల వల్ల గొర్రెల్లో రక్తం తగ్గిపోయి పునరుత్పత్తి శక్తిని కోల్పోతాయన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి రాంరెడ్డి, జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు భూమయ్య, ప్రతినిధులు వీరయ్య, మల్లయ్య, గోపాలమిత్రలు పాల్గొన్నారు.