గొల్లగూడెం పంచాయతీల్లో రాజ్యమేలుతున్న సమస్యలు

ఖమ్మం, జూలై 19: ఖమ్మం పట్టణ శివార్లలో అత్యంత అధునిక భవనాలతో నిండి ఉన్న గొల్లగూడెం గ్రామ పంచాయితీలోని మధురానగర్‌ కాలనీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ కాలనీలో మురుగు కాల్వల నిర్మాణం దీనికి అనుగుణంగా చేపట్టకపోవడంతో ఇబ్బందిగా మారింది. పక్కనే ఉన్న ఖానాపురం హవేలి పంచాయతీ పరిధిలోని శ్రీనగర్‌ కాలనీ, వరదయ్యనగర్‌, పోలీసు కాలనీల నుంచి వచ్చే మురుగునీరు ఈ కాలనీ ప్రధాన రహదారివెంట చేరితే స్థానికులను ఇబ్బంది పెడుతుంది. మురుగునీరు ముందుకుపోయే వీలులేక ఎక్కడికక్కడే నిల్వ ఉండడంతో దుర్వాసన, దోమలు విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా చుట్టుపక్కల మంచినీటి బోర్లలో ఈ నీరు ఇంకి కలుషితమవుతోందని, చర్మవ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. 15 రహదార్లతో విస్తరించి ఉన్న ఈ కాలనీలో మూడు నాలుగు రహదార్ల మినహా ఏమి అభివృద్ధి చెందలేదు. ఎగుడుదిగుడు రహదార్లతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు వాపోతున్నారు. శివారు ప్రాంతం కావడంతో పాములు, తేళ్లు, ఇతర విషపు పురుగులు సంచారం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ అధికారులు ఈ కాలనీపై దృష్టి సారించి, సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.