గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు

సత్ఫలితాలనిస్తున్న గొర్రెల పంపిణీ పథకం

నిజామాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): గొర్రెల పంపిణీ పథకం రెండోదశ కామారెడ్డి నుంచి జూలై తొలివారంలో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. తొలివిడత మంచి ఫలితం ఇచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణను మాంసం ఎగుమతుల్లో నంబర్‌ వన్‌ చేయాలని సిఎం కెసిఆర్‌ ఈ పథకాన్‌ఇన ప్రకటించారు. ఏడాది క్రితం ప్రారంభించిన గొర్రెల యూనిట్ల పథకానికి మంచి స్పందన రావడంతో పాటు గొర్రెల సంతతి 30 శాతానికి పెరిగింది. ఎనిమిది నెలల్లో ఈనిన గొర్రెలకు పిల్లల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గొల్లకురుమలు గొర్రెల యూనిట్లపై మక్కువ చూపి రెండోవిడతలో ఇస్తున్న గొర్రెల యూనిట్ల కోసం ఆరాటపడుతున్నారు. గొర్రెల సంతతి జిల్లాలో ఎక్కువగానే పెరిగినట్లు అధికారులు లెక్కలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన గొర్రెలు గొల్లకురుమలు ఆర్థికంగా బలోపేతం అవడానికి ఉపయోగ పడుతున్నాయి. సమయానికి మేత, సకాలంలో మందులు వేసి వాటిని జాగ్రత్తగా పెంచుకుంటే ఊహించని లాభాలు వస్తాయి. ఏడాదికి రెండు సార్లు పిల్లలను పెడతాయి. బలంగా పెరిగితే రేటు ఎక్కువ వస్తుంది. మాసాంహారానికి మంచి డిమాండ్‌ ఉంది కాబట్టి మా కులస్తులకు మంచి ఆదాయ వనరుగా మారింది.గొర్రెల పెంపకానికి జిల్లాల్లో అనుకూలమైన వాతావరణం నెలకొంది. జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడిన వారు ఎక్కువ శాతం ఉన్నారు. ప్రోత్సాహం లేక, పేదరికంతో ఇబ్బంది పడుతూ జీవాలను కొనుగోలు చేసి పెంచే స్థోమత లేని పరిస్థితిలో అనేక మంది ఇతర కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనుకూలమైన వాతావరణం ఉండటంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల గొల్ల, కురుమ, యాదవుల జీవన స్థితిగతులను సంపూర్ణంగా మార్చే మహత్తర అవకాశం లభించిందని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే గొల్ల కురుమలకు మంచి అవకాశం లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటే గొర్రెలు మందలుగా తయారయ్యే అవకాశముంది. జూలై నుంచి రెండో విడత గొర్రెలు పంపిణీకి సిద్దం అయినట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా గొల్లకురుమల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఎన్నో ప్రభుత్వాలు మారినా కులవృత్తుల జీవితాలు మారలేదని, తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే తమ బతుకులు మారాయని వారు అంటున్నారు. కనుమరుగవుతున్న కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోసింది. పేదరికం నుంచి బయటపడేందుకు, ఆర్థికంగా మెరుగుపర్చే విధంగా గొల్లకురుములకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేయడంతో వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయి. గొల్ల కురుమలు వాటిని అనుకూల వాతావరణంలో పెంచడంతో వాటి పునరుత్పత్తి పెరిగి ఆయా కుటుంబాలకు కోట్ల ఆదాయం సమకూరినట్లయింది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గొల్లకురుమలకు తెలంగాణ ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో అందజేసిన గొర్రెల యూనిట్ల పంపిణీకి అనూహ్య స్పందన లభించింది. గతేడాది జూన్‌లో గొర్రెలు పంపిణీ చేయగా, ప్రస్తుతం వాటి సంతతి ఏడాదిలో భారీగానే పెరిగింది. జిల్లాల్లో కనీపసంగా 30 శాతం అదనంగా గొర్రెలు పెరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇక జీవాలకు రోగాలు రాకుండా ప్తర్యేక ఏర్పాట్లు చేశారు. కాల్‌ చేస్తే గ్రామాలకు చేరుకునే సంచార వైద్యం జీవాలకు అందుబాటులోకి వచ్చింది. జీవాల మరణాలు తగ్గడం కోసం సమయానికి వాటికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ సదుపాయం ఏర్పాటు చేసింది. గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయడంతో పాటు వివిధ రకాల మందులు అందుబాటులోకి ఉంచింది. జబ్బ, పారుడు రోగం, మూడు రకాల వ్యాక్సిన్‌తో పాటు 425 రకాల మందులను వాటికి అందుబాటులో ఉంచింది. వ్యాధులు తగ్గడానికి అందుబాటులోకి మందులు ఉంచడమే కాకుండా వాటికి ఆహారం కొరత తీర్చేందుకు గడ్డి విత్తనాలను కూడా ఉచితంగా సరఫరా చేసింది. సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం వాటి యజమానులకు గడ్డి విత్తనాలు, మందులు పంపిణీ చేస్తోంది. పశుసంవర్థక ఆధ్వర్యంలో యాదవ సంఘం నాయకులు సంఘాల సభ్యుల వారీగా అన్ని మండలాల్లో విత్తనాలు అందజేస్తోంది. సంచార పశువైద్యశాలలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించారు. నాటి నుంచి గ్రామాల్లో తిరుగుతూ జీవాల వ్యాధులకు చికిత్సలు చేయడం ప్రారంభించారు. రోజుకు ఆరు నుంచి 10 పశువులకు, గొర్రెలకు వైద్యం చేస్తున్నారు. ఈ అంబెలెన్స్‌లో ఒక డాక్టర్‌, ఒక టెక్నీషియన్‌, ఒక డ్రైవర్‌, హెల్పర్‌తో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ఇప్పటికీ పశుసంవర్థక శాఖ బృందం లబ్ధిదారులకు నచ్చిన మేకలను కొనుగోలు చేయించి పంపిస్తున్నారు.

—————