గోడను ఢీకొట్టిన మెట్రో రైలు 

న్యూదిల్లీ: దిల్లీలో డ్రైవర్‌ లేని మెట్రో రైలు ఒకటి ప్రమాదానికి గురైంది. ఇక్కడి కలిందికుంజ్‌ డిపో రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుండగా స్టేషన్‌లో సరిహద్దు గోడను ఢీకొట్టింది. ఈ నెల 25న ప్రధాని మోదీ ఈ నూతన రైల్వేన్‌ను ప్రారంభించాల్సి ఉండగా.. ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రమాదంలో రెండు కోచ్‌లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఆటోమేటిక్‌ బ్రేకులు పడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దిల్లీ మెట్రో అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

కల్కాజీమందిర్‌- బొటానికల్‌ గార్డెన్‌ను కలుపుతూ నూతనంగా ఏర్పాటు చేస్తున్న మార్గాన్ని మెజెంతా లైన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 25న ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించాల్సి ఉంది. ప్రమాద కారణంగా ప్రస్తుతం ప్రారంభోత్సవంపై అనుమానాలు నెలకొన్నాయి. గత నెలలోనే దీనికి మెట్రో రైలు భద్రతా కమిషనర్‌ భద్రతా అనుమతులు జారీ చేయడం గమనార్హం.