గోదావరిలో కొనసాగుతున్న ఉధృతి
ములుగు జిల్లా రామన్నగూడెంలో మూడో ప్రమాద హెచ్చరిక
నీట మునిగిన పుష్కర ఘాట్
ములుగు,జూలై14(జనం సాక్షి): వారం రోజులుగా కురిసిన వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ములుగు జిల్లా రామన్న గూడెం పుష్కర ఘాట్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత నీటి మట్టం 17.460 విూటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. నాగులమ్మ వీధిలోకి భారీ వరద చేరింది. పలు ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో.. కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ పొంగిపొర్లుతుంది. వరద పోయేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను గ్రామస్థులు కోరారు. కుమురం భీం జిల్లా కౌటల మండలంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ లోని పెన్ గంగానదికి మహారాష్ట్ర నుంచి వరద ప్రవహిస్తోంది. చెనాక`కోరాట బ్యారేజ్ దగ్గర పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక లక్ష 91 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తోందని అధికారులు తెలిపారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాలోనూ గోదావరి వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల వెళ్లే వాహనాలను పోలీసులు గోదావరిఖని బస్టాండ్ వద్ద నిలిపివేశారు. తెలంగాణ`మహరాష్ట్ర కు రవాణా నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లాలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గోదావరిఖని` మంచిర్యాల దారిలోని బ్రిడ్జి పై వరద చేరింది. గోదావరిఖని గంగానగర్ దగ్గర ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. నది ప్రవాహాన్ని గంగానగర్ ప్రాంతాన్ని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. మరోవైపు మంచిర్యాల` గోదావరిఖని మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంగానగర్‌లో చెక్ పోస్టు ఏర్పాటు చేసి…. బస్టాండ్ సవిూపంలోనే వాహనాలు నిలిపివేస్తున్నారు అధికారులు. కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి, ప్రాణహిత ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతి ఇలాగే కంటిన్యూ అయితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. పుష్కర ఘాట్లు, చిరు దుకాణాలు నీట మునిగిపోయాయి. కాళేశ్వరం వద్ద ప్రస్తుతం 15.800 విూటర్ల ఎత్తులో గోదావరి నీటి మట్టం ఉంది. 2013లో జూలై ` అగస్థులో 14.5 విూటర్ల ఎత్తులో ప్రవహించగా 1985లో 15.0 విూటర్ల ఎత్తులో నీరు ప్రవహించిదని అధికారులు చెబుతున్నారు. గోదావరి వరద నీరు లక్ష్మీ బ్యారేజీ లోకి భారీగా చేరుకొంటోంది. రికార్డ్ స్థాయిలో ఇన్ఫో ఉందని, మొత్తంగా బ్యారేజీ నిండు కుండలా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
లక్ష్మీబ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం చుట్టూ …భారీగా వరదనీరు చేరింది. దీంతో.. గుడి దగ్గరున్న 20 మంది వరదల్లో చిక్కుకున్నారు. పూజారుల కుటుంబ సభ్యులు 17మంది, మరో ముగ్గురు చేపల వేటగాళ్లు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.