గోదావరి ఉగ్రరూపంతో ప్రజల్లో ఆందోళన

ములుగు జిల్లాలో తగ్గని గోదావరి ఉధృతి
ఎక్కడ చూసినా నీట మునిగిన పంటపొలాలు
రామప్ప ఆలయంలో వరదనీరు చేరిక

ములుగు,జూలై15(జనంసాక్షి): గోదావరి పరివాహక ప్రాంతం ప్రమాదంలో ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏటూరునాగారం మండలం, రామన్నగూడెం పుష్కర ఘాట్‌ దగ్గర 18.600 విూటర్ల మేర గోదావరి ప్రవాహం ఉంది.ములుగు, వాజేడు మండలంలోని పేరూరు దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
18.89 విూటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలతో అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇంత నష్టం జరిగిన వ్యవసాయాధికారులు పంట నష్టాలను అంచనా వేయడం లేదు. పరిహారం వచ్చే అవకాశాలు కనిపించక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నీరే దర్శనమిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి నది తన మహోగ్రరూపంతో వణికిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భీకరంగా పోటెత్తుతోంది. ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటడంతో తీర ప్రాంతాల్లోని గ్రామాలు జలమయం అయ్యాయి. వేలాదిమంది జనం నిరాశ్రయులయ్యారు. రెండు జిల్లాల అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల జోరు ఇంకా తగ్గక పోవడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు గోదావరి తీరంలో ఉన్న గ్రామాల్లోకి బ్యాక్‌ వాటర్‌ చేరటంతో పాటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచి పోవటంతో పాటు నిత్యావసర సరుకులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి ఈ స్థాయిలో ఉప్పొంగడం 1986లో జరిగిందని, 36 ఏళ్లకు ఇప్పుడు మళ్లీ ప్రవహిస్తోందని చెబుతున్నారు.
మరోవైపు ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అధిక వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరుతోంది. మురుగు కాల్వలోకి సాఫీగా నీరు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోతోంది. రామప్ప దేవాలయం.. ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక కట్టడం. కాకతీయులు మేధోసంపత్తిని, గజ, అశ్వ, సైనిక బలాలను ఉపయోగించి ఇసుక దిబ్బపై ఎంతో నేర్పు, పరిజ్ఞానంతో నిర్మించిన రాతి కట్టడం కావడంతోఅధిక వర్షాలతో ముప్పును ఎదుర్కొంటోంది. పురావస్తుశాఖ నిర్లక్ష్యం కారణంగా ఏటా వర్షాకాలంలో ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రామప్ప ఆలయం చుట్టూ వరదనీరు చేరుతోంది. నలుమూలలా మురుగుకాల్వల్లో పూడిక మట్టి చేరింది. రామప్ప ఉపాలయాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కనీసం వరదనీటిని ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. 2020లో ఆలయం ఈశాన్య భాగంలోని ప్రహరీ వర్షాలకు కూలింది. ఇప్పటికీ మరమ్మతులు చేపట్టలేదు. 2017లో ఆలయానికి వెళ్లే మార్గంలో.. ప్రస్తుత పార్కింగ్‌ స్థలానికి దగ్గరలోని శివాలయం కూడా కూలి పోయింది. దీనిని పునరుద్ధరించ లేదు. 2015లో నీరు లీకవుతున్న ప్రాంతాలను గుర్తించి పైభాగంలోని ఒక పొరను పూర్తిగా తొలగించారు. కొత్తగా మళ్లీ శ్లాబ్‌ వేసినా ఫలితం లేకపోయింది. 2014లో ఆలయంలోని మరో 4చోట్ల నీరు కారడం మొదలైంది. దాన్ని అరికట్టడం కోసం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేశారు. పనులు నామ మాత్రంగా చేయడంతో సమస్య మళ్లీ ఉత్పన్నమైంది. 2013లో ఆలయంలోని ఈశాన్యభాగంలో చిన్నగా నీరు కారడం మొదలైంది. దాంతో అప్పుడప్పుడు పెచ్చులూడుతున్నాయి.ఇవీ చేయాల్సిన పనులు.. రామప్ప పర్యవేక్షణకు ఐఏఎస్‌ స్థాయి అధికారిని నియమించాలి. ఆలయ పరిధిలోని పురావస్తు శాఖ అధికారులు సైతం నిత్యం రామప్పలోను ఉంటూ విధులు నిర్వర్తించేలా చూడాలి. కాకతీయులు ముందు చూపుతో ఆలయం నలుమూలలా మురుగు కాల్వలను నిర్మించినా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయక
పోవడంతో ప్రమాదం ఏర్పడిరది.