గోదావరి జలాలు గ్రామాలకు తరలితేనే అభివృద్ధి
– ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
– కేటీఆర్
ఖమ్మం,మే7(జనంసాక్షి):గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఈ మేరకరు సీతారామ ప్రాజెక్టును చేపట్టామని అన్నారు. జిల్లాలో గోదావరి పారుతున్నా దుర్భిక్షం నెలకొనడానికి గత పాలకులే కారణమన్నారు. పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయని పనిని తెరాస ప్రభుత్వం చేస్తుందని, జిల్లాలో 5 నుంచి 6 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తుందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టును పాలేరు జలాశయానికి అనుసంధానించి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆయకట్టను స్థిరీకరిస్తామన్నారు. రాష్ట్ర సాధన కోసం ఏ నిబద్ధతతో పనిచేశామో అదే వైఖరితో రాష్టాన్న్రి అభివృద్ధి పరుస్తామన్నారు. గత ప్రభుత్వాలు పాలేరు నియోజకవర్గాన్ని ఎడారిగా మార్చాయని ప్రజలకు పనికి వచ్చే ఒక్క మంచి కార్యక్రమం కూడా చేపట్టలేదనిమంత్రి కేటీఆర్ విమర్శించారు. తుమ్మల విజయం ద్వారా
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఖమ్మం శాసన సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్, నల్గొండ జిల్లా పొనుగోడు శాసనసభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.




