గోదావరి తీరంలో ఘనంగా శివరాత్రి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఆదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం, ద్వారక, గుడిరేవు, కాసిపేట, వెల్గనూర్‌ గ్రామాల్లోని గోదావరి నదీ తీరాలు మంగళవారం భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. భక్తులు ఉదయాన్నే నదీతీరాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం సవిూపంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.అయితే, కాసిపేట, వెల్గనూర్‌లో గోదావరిలో సరిపడ నీళ్లు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కడెం ప్రాజెక్టు నుంచి నీరు వదిలినప్పటికీ అవి ఇక్కడివరకు చేరుకోకపోవడంతో స్నానాలకు నీటి కొతర ఏర్పడింది. చెన్నూరు  మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. సుందర్‌శాల, నాగాపూర్‌, వెంగంపేట గ్రామాల సవిూపంలో ఉన్న గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. శివరాత్రి సందర్భంగా కత్తెరశాల మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఉదయం 11 గంటలకు భ్రమరాంబిక మల్లికార్జునస్వామిల వివాహం జరిపించారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించడానికి చెన్నూర్‌ ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్‌నల్లాల ఓదేలు వచ్చారు. గోదావరిలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈఘటన కరీంనగర్‌ జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలలో మంగళవారం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బొమ్మారెడ్డిపల్లికి చెందిన యువకుడు సంతోష్‌ కోటిలింగాలకి వెళ్లాడు. గోదావరి నదిలో స్నానం చేయడానికని దిగిన సంతోష్‌ దురదృష్టవశాత్తూ నదిలో కొట్టుకుపోయాడు.  గజ ఈతగాళ్లు ప్రస్తుతం గల్లంతయిన సంతోష్‌ కోసం గాలిస్తున్నారు.