గోదావరి తీరానికి వరదముప్పు కేంద్రం ముందస్తు హెచ్చరిక

న్యూఢిల్లీ,ఆగస్ట్‌30: వచ్చే 72 గంటల్లో దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాలన్నింటికీ వరద ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర జలవనరులశాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. తెలుగు రాష్టాల్ల్రో గోదావరి తీరంలోని జిల్లాలకు వరద ముప్పు ఎదురుకానున్నట్లు పేర్కొంది. ఎగువప్రాంతాల్లో కురిసేవర్షాల కారణంగా మహారాష్ట్రలోని నాసిక్‌, అహ్మద్‌నగర్‌, ఔరంగాబాద్‌, పర్బణి, నాందేడ్‌ జిల్లాల్లో గోదావరి పొంగిప్రవహించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో కురిసే వర్షాలతో జగదల్‌పూర్‌, దంతేవాడల్లో ఇంద్రావతి నదికి ఓ మోస్తరుగా వరద వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీనివల్ల తెలంగాణలోని నిజామాబాద్‌, జయశంకర్‌, భద్రాద్రికొత్తగూడెం, ఆంధప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాలకు వరద ముప్పురావొచ్చని హెచ్చరించింది. సతారా, సాంగ్లి, కొల్హాపూర్‌, పుణెళి, షోలాపూర్‌, కర్ణాటకలోని బాగల్‌కోట్‌, విజయపుర, కలబుర్గిజిల్లాల్లోని ఉపనదులు, చికమగళూరు, శివమొగ్గ, బళ్లారి జిల్లాల్లో కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వచ్చే 48 గంటల్లో తూర్పురాజస్థాన్‌, పశ్చిమమధ్యప్రదేశ్‌, దక్షిణ కర్ణాటకలోని కోస్తా, కనుమ ప్రాంతాలు, వచ్చే 72 గంటల్లో గుజరాత్‌, కొంకణ్‌, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ వర్షాలవల్ల మాహి, సబర్మతి, బనస్‌, కృష్ణాతోపాటు వాటి ఉపనదులు, తపతి, కావేరిలకు ఓ మోస్తరు వరద వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.