గోరక్షకుల దాడులపై సుప్రీం ఆగ్రహం

– టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేయండి

– రాష్ట్రాలకు ఆదేశం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న హింసపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. గో రక్షకుల ఆగడాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు చెక్‌ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని బుధవారం ఆదేశించింది. సీనియర్‌ పోలీసు అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ వారంలోగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని తేల్చిచెప్పింది. ఈ హింసను అంతమొందించడానికి దేశంలోని ప్రతి జిల్లాలో ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కనీసం డీఎస్పీ స్థాయి పోలీస్‌ అధికారి నేతృత్వంలో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతున్నది. టాస్క్‌ఫోర్స్‌లో ఉండే సీనియర్‌ అధికారి ఇలాంటి ఘటనలు రిపీట్‌ కాకుండా చూడాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుపై వారం రోజుల్లో తమకు రిపోర్ట్‌ ఇవ్వాలని ప్రభుత్వాలను ఆదేశించింది. రాష్టాల్ర చీఫ్‌ సెక్రటరీలు, డీజీపీలు వెంటనే ఈ దిశగా చర్యలు మొదలుపెట్టాలని కోర్టు నిర్దేశిరచింది. ఇలాంటి ఘటనలను సహించేది లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసినా.. వాటిని అరికట్టడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రాష్టాల్రే ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన తర్వాత కూడా ఇలాంటివి 66 ఘటనలు నమోదైనట్లు సీనియర్‌ అడ్వొకేట్‌ ఇందిరా జైసింగ్‌ కోర్టుకు తెలిపారు. దీనిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిందే. ప్రణాళిక బద్ధంగా ఈ హింసను ఆపాలి అని కోర్టు స్పష్టంచేసింది. ఎలా చేస్తారన్నది రాష్టాల్రే నిర్ణయించుకోవాలి.. ఇది వాటి పనే అని కూడా కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. జర్నలిస్ట్‌ తుషార్‌ గాంధీ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం ఈ విచారణ చేపడుతున్నది. సెప్టెంబర్‌ 22న మరోసారి ఈ కేసుపై సుప్రీం ధర్మాసనం విచారణ జరపనుందిఅలాగే గో రక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై అరాచకాలు, హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్‌ ఎస్‌ పూనావాలా గత ఏడాది అక్టోబర్‌ 21న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గత జూలై 21న వాదనల సందర్భంగా దాడులకు దిగుతున్న గో రక్షకులను కాపాడాలని చూడొద్దని, గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలుపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.తాజా విచారణ సందర్భంగా గో రక్షణ దాడులకు వ్యతిరేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్టాల్రకు ఏడురోజుల గడువు ఇచ్చింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించవద్దని, గోరక్షణ దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.