గోరఖ్‌పూర్‌ కొనసాగుతున్న ఘోరాలు

– ఆగష్టు నెలలో 290 మంది చిన్నారుల మృతి

గోరఖ్‌పూర్‌,,ఆగష్టు 30,(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ్‌దాస్‌ మెడికల్‌ కళాశాల (బీఆర్డీ)లో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. ఆక్సిజన్‌ అందక చిన్నారులు పిట్టల్లా రాలిపోయిన విషయం తెలిసిందే. ఒక్క ఆగస్టు నెలలోనే 290 మంది చిన్నారులు ఆస్పత్రిలో మరణించారని కళాశాల ప్రిన్సిపల్‌ పీకే సింగ్‌ వెల్లడించారు. వీరిలో చిన్నారుల ఐసీయూలో 213 మంది మృతిచెందగా.. మెదడవాపు వ్యాధి వార్డులో 77 మంది కన్నుమూశారని తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 1250 మంది చిన్నారులు మరణించారని వెల్లడించారు. ముఖ్యంగా మెదడువాపు, నవజాత, చిన్నారుల వార్డుల్లోనే ఈ మరణాలు సంభవించినట్లు తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో మరో 37 మంది చిన్నారులు కన్నుమూశారని వెల్లడించారు.మరణాలకు సంబంధించిన కారణాలను కూడా సింగ్‌ విశ్లేషించారు. వివిధ రకాల సమస్యలతో చిన్నారులు ఆస్పత్రిలో చేరుతున్నారన్నారు. ముఖ్యంగా నెలలు నిండని చిన్నారులు, తక్కువ బరువు గల శిశువులు, కామెర్లు, న్యుమోనియా వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు ఇక్కడ చేరుతుంటారని తెలిపారు. పరిస్థితి విషమించిన తర్వాతనే ఇక్కడ ఎక్కువగా చేర్పిస్తున్నారని, సకాలంలో తీసుకొస్తే వారి ప్రాణాలను కాపాడగలమని పేర్కొన్నారు.