గౌతమ్‌ రెడ్డి మృతితో నెల్లూరులో విషాదం

హఠాన్మరణ వార్తతో అభిమానుల దిగ్భార్రతి
తీవ్ర విచారం వ్యక్తం చేసిన కోటంరెడ్డి, ఆనం
నెల్లూరు,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన సొంత జిల్లా నెల్లూరు విషాదంలో మునిగిపోయింది. ఆయనమరణవార్తను తెలుసుకుని ప్రజలు కన్నీరుమున్నీర య్యారు. ఇది కలానిజమా అన్న సందేహం నుంచి బయటపడలేదు. అభిమానులు, కార్యకర్తలు, స్నేహితులు మేకపాటి గెస్టు హౌస్‌కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆయన మరణం తీవ్ర దిగ్భార్రతికి గురిచేసిందని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. రాజకీయాల్లో గౌతమ్‌ రెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. ఆయన వద్దకు ఎవరు వచ్చినా సహాయం చేసేవారని, అటువంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమన్నారు. దుబాయ్‌ పర్యటన ముగిసిన తర్వాత వచ్చిన ఆయన ఏపీకి పరిశ్రమలు వస్తాయని తెలిపారన్నారు. అంతలోనే ఇలా జరగడం నెల్లూరు
జిల్లాకు, పార్టీకి తీరని లోటని అన్నారు. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో ` హైదరాబాద్‌ లో మృతి చెందారన్న వార్త నమ్మలేకున్నానని`వివాద రహితుడు,మృదు స్వభావి అయిన గౌతమ్‌ పిన్న వయసులో హఠాత్మరణం పొందడం..చాలా బాధాకరంగా వుందని మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. యువనేత మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతిపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి సోమవారం తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గౌతమ్‌ రెడ్డి అకాల మృతి తనను ఎంతగానో కలచివేసిందని బాధను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఒక క్రమపద్ధతిలో చేస్తూ గౌతమ్‌ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అక్కడి ప్రజలకు తీరని లోటు అన్నారు. తనకు ఆయనతో ఎంతో ఆత్మీయత ఉందని, వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.