గౌతమ్‌ రెడ్డి లేని టోఉ పూడ్చలేనిది

గౌతం రెడ్డి మృతికి శాసనసభ సంతాపం
సంగం బరాజ్‌కు గౌతం రెడ్డి పేరు
సభలో వెల్లడిరచిన సిఎం జగన్‌ వెల్లడి
అమరావతి,మార్చి8(జనం సాక్షి): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని, ఆయన మృతి తనతోపాటు తన పార్టీకి, రాష్టాన్రికి తీరని లోటని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్ది చెప్పారు. ఎంతో సౌమ్యుడైన గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణం తనను ఎంతగానో కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డికి నివాళిగా సంగం బరాజ్‌కు ఆయన పేరు పెడతామని అసెంబ్లీలో జగన్‌ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు గౌతమ్‌రెడ్డి సేవలను, ఆయన మంచితనాన్ని, తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చివరగా మాట్లాడిన సీఎం జగన్‌.. గౌతమ్‌రెడ్డి తనకు చిన్ననాటి నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరంగా ఉన్నదన్నారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్లు చెప్పారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించారని కొనియాడారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి చేశారని, గౌతమ్‌రెడ్డి మనతో లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్‌ స్పష్టం
చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బరాజ్‌ పనులను 6 వారాల్లో పూర్తి చేసి, ఆ బరాజ్‌కు మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్‌గా నామకరణం చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు.