గ్యాస్‌ కొరతపై కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : సంక్షేమ పథకాలైన అంగన్‌వాడీ కేంద్రాలకు మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు గ్యాస్‌ కోతను విధిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిఐటియు నగర కమిటీ బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నగర కమిటీ అధ్యక్షుడు గణపతి, కార్యదర్శి గోవర్దన్‌లు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు గ్యాస్‌ పంపిణీ విషయంలో పరిమితులు విధించవద్దని డిమాండ్‌ చేశారు. సిలిండర్ల కోతల వల్ల తిరిగి కట్టెల పొయ్యిని వాడాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అదనంగా మూడు సిలిండర్లను ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఈ చ్యలను ఉపసంహరించుకోకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎఓ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నవీన్‌, తదితరులు పాల్గొన్నారు.