గ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీ కోతకు నిరసనగా హాస్టల్‌ విద్యార్థుల ఆందోళన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1: గ్యాస్‌ సిలిండర్లపై సబ్సిడీ కోతకు నిరసనగా శనివారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులంతా మెస్‌ చార్జీలు పెంచకపోగా హాస్టల్స్‌కి ఇచ్చే సిలిండర్లపై సబ్సిడీని ఎత్తివేసి విద్యార్థులపై సిలిండర్ల భారాన్ని ప్రభుత్వం మోపుతుందన్నారు. సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూనే సంక్షేమ హాస్టల్‌లో  ఉంటున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఆకలితో అలమటించే విధంగా చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలను పెంచకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఖైదీలకు రోజు రూ.40 రూపాయలు ఖర్చు పెడుతుందని, విద్యార్థులకు మాత్రం 16 రూపాయలే ఖర్చు పెట్టడంలో అంతర్యం ఏమిటన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం 60 కోట్ల ఖర్చుపెట్టకపోవడం దారుణమన్నారు. హాస్టల్‌, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఇచ్చే సిలెండర్లపై సబ్సిడీ కోతను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సునీత, జ్యోతి, మౌనిక, రాణి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు