గ్రామాలు లక్ష్యంగా అభివృద్ది సాగాలి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా ఆకలి, అవిద్య, అనారోగ్యాలు, పర్యావరణ సమస్యలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించగలదు. పంచాయితీలను పరిపుష్టం చేసేదిశగా పాలన సాగాలి. అప్పుడే గ్రామాల అభివృద్ది తద్వారా దేశాభివృద్ది సాగగలదు. ప్రధానంగా పారిశుద్యం, పర్యావరణం, మంచినీటి సమస్య,సాగునీటి సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. వీటి పరిష్కారం లక్ష్యంగా గ్రామాలను పటిష్టం చేయాలి. గ్రామాలను అభివృద్ది చేసే క్రమంలో రాజకీయాలు లేకుండా ముందుకు సాగితేనే పురోగమిస్తాం. గ్రామాలను పక్కన పెట్టి పెత్తనం చేయడం సరికాదని పాలకులు గుర్తుంచుకోవాలి. గ్రామస్వరాజ్యం గురించి మాట్లాడుతున్న ప్రధాని మోడీ తన ఐదేళ్ల పాలనలో ఈ దిశగా కృషి చేసిన దాఖలాలు లేవు. తెలంగాణలో మాత్రం సిఎం కెసిఆర్ కొన్ని రంగాల్లో పురోతి సాధించారు. తాజాగా జరుగుతన్న పంచాయితీ ఎన్నికల తరవాత ఇందుకు అనుగుణంగా మరిన్ని మార్పులు తీసుకుని వస్తే గ్రామాలు స్వయం సమృద్దిని సాధిస్తాయనడంలో సందేహం లేదు. గ్రామాల వెనకబాటుకు ప్రజలు కారణం ఎన్నడూ కాదు. ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్యం కొరవడి అంటువ్యాధులు ప్రబులుతున్నాయి. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. చెట్లను నరికి ఎడారులను చేస్తున్నారు. కొండలు,గుట్టలు కొట్టేస్తున్నారు. అధికారం అప్పగించినప్పుడు సరైన దారిలో పాలకులు నడవకపోవడం వల్లనే ఈ దౌర్భాగ్యం మనలను వెన్నాడుతున్నాయని గుర్తించాలి. భారతదేశంలో గ్రామస్వరాజ్యం రావాలని గాంధీజీ కలలు కన్నప్పటికి ఆయన సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అర్ధదశాబ్దం పాలించినా అది సాకారం కాలేదు. గ్రామాలు బాగుపడితేనే దేశం ఆర్థికంగా పటిష్టం అవుతుంది. అందుకు పాలకులు నడుం బిగించాలి. ఆ దిశగా కార్యక్రమాలు చేయాలి. అయితే గ్రామాల్లో అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న దాఖలాలు కనబడడం లేదు. ప్రజలు ఉపాధి కోసం గ్రామాలను వదిలి పట్టణాలకు వలసలు పోతున్నారు. దీనికి కారణం ఏంటన్నది ఆలోచన చేయాలి. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాకారం చేసుకోవాలంటే కఠిన శ్రమ తప్పదు. మనదేశాన్ని మెరుగుపరచడానికి అంకితభావం, కట్టుబాటు, చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరగాలి. మనలను మనం పాలించుకుంటున్న ఈ కాలంలో దేశ హితం కోరి పాలకులు అడుగువేయాలి. రాజకీయాలంటే ఎదుటి వారిని ఓడించడమే లక్ష్యం కాదు. రాజకీయమంటే అంకితభావంతో దేశ అభివృద్దిలో బాగస్వామ్యం కావడం. ప్రజలను దేశం కోసం ప్రభావితం చేయడం కావాలి. అభివృద్ది అన్నదే నినాదంగా రాజకీయాలు నడవాలి. అప్పుడే దేశంలో అసమానతలు తొలగిపోతాయి. అలాగే యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా అభివృద్దికి బాటలు వేయాలి. గ్రామాల్లో వివిధ కార్యక్రమాలను సక్రమంగా ముందుకు తీసుకుని వెళితే నిరుద్యోగ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. వ్వయసాయ అనుబంద పరిశ్రమలను పునరుద్దరించాలి. యువతకు ఉపాధి కార్యక్రమాలను అందించాలి. మెచ్చుకోలు ప్రసంగాలతో కాకుండా పక్కా ప్రణాళిక, అందుకు తగ్గట్లుగా కార్యాచరణ లక్ష్యంగా పాలన సాగాలి. తమ కలలు, ఆకాంక్షలు, ఆదర్శాలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యం యువతలో కలిగించాలి. వారిలో నిరాశా నిస్పృహలు వస్తే దేశానికి ప్రమాదం. అలాకాకుండా వారు నిరుద్యోగులగా మిగలకుండా, కనీసం స్వయం ఉపాధి పొందేలా ప్రణాళికను అమలు చేయాలి.అలాగే ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించినా ఇప్పటికీ పౌష్టికాహారలేమి కారణంగా వ్యాధుల బారిన పడుతున్నాం. సరైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా చేయగలగాలి. ఇదే మనముందున్న సవాల్. మన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి, దేశ భవిష్యత్తుకు ఇది చాలి ముఖ్యం. మానవ వనరులపై మనం పెట్టుబడి పెట్టాల్సిందన్న నిపుణుల సూచనలు పాలకులకు కనువిప్పు కావాలి. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో పేదరికాన్ని నిర్మూలించడం మన పవిత్ర కర్తవ్యంగా భావించి అందుకు ప్రణౄళికబద్దంగా ముందుకు సాగాలి. ఎంతకాలం అధికారంలో ఉన్నామన్న దానికన్నా ఎన్ని మంచి పనులతో దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్లామన్నది లక్ష్యం కావాలి. ప్రతి ఒక్కరం మన కలల్ని సాకారం చేసుకుందాం అన్నరీతిలో సాగాలి. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే వ్యవస్థలు చాలా ముఖ్యమనీ, ఇవి నిజాయతీతో, క్రమశిక్షణతో తమ పరిధులు గుర్తెరిగి పనిచేయాల్సి ఉంది. మనదేశ జనాభాలో 60 శాతం మంది వయసు 35 ఏళ్లకంటే తక్కువే ఉంది. వారి ఆశలన్నీ నెరవేర్చలేకపోయినా నైరాశ్యంలో కొట్టుకు పోకుండా చూడాలి. అక్షరాస్యత పెంచడానికి చాలా కృషి జరిగింది. ఇప్పుడు దాని స్థాయిని మరింత పెంచి… విద్యతో పాటు విజ్ఞానం కూడా అందరికీ చేరేలా చూడాల్సి ఉంది. డిజిటల్ ఆర్థిక రంగం, రోబోటిక్స్, యాంత్రికీకరణ యుగానికి తగ్గట్టుగా విద్యావ్యవస్థను మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం బట్టీ పట్టి, పరీక్షల్లో దానిని రాయడం కాకుండా పిల్లల్లో ఆలోచనల్ని, జిజ్ఞాసను రేకెత్తించేలా పాఠశాల విద్య ఉండాలి. నవకల్పనలే విద్యార్థుల లక్ష్యం కావాలి. ఇవన్నీ సాకారం కావాలంటే క్షేత్రస్థాయి సంస్కరణలు అవసరం. గ్రామాల నుంచే సంస్కరణలు రావాలి. గ్రావిూణ ప్రాంతాలు ఇప్పటికీ సరైన రహదారి సదుపాయానికి నోచుకోని పరిస్థితుల్లో ఉన్నాయి. వీటిని అధిగమించేలా పనులను చేపట్టి అందుకు అనుగుణంగా గ్రామాలను బలోపేతం చేయాలి. అది జరిగితే దేశం బలోపేతం కావడం ఖాయం.