గ్రామాల్లో ఆశావహుల సందడి
పంచాయితీ ఎన్నికల కోసం నేతల ఎదురుచూపు
జగిత్యాల,డిసెంబర్15(జనంసాక్షి): గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రకటన ఎప్పుడు వెలువడుతుందోనన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడువులోపే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం, ఎన్నికల కమిషన్ రిజర్వేషన్ల పక్రియ, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, పోలింగ్
అధికారులు, సిబ్బంది నియామకం, తదితర పనులను వేగవంతం చేస్తుండడంతో సర్పంచులుగా పోటీ చేయాలన్న ఆశావహుల్లో రిజర్వేషన్ల ప్రకటన రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. రిజర్వేషన్ల ప్రకటన ఎప్పుడెప్పుడా అనే ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు .జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం 380 గ్రామ పంచాయితీలు, 3,500 వార్డులున్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు కూడా సిద్దం చేశారు. గత ఆగస్టు 1 నాటికి 327 పంచాయతీల పాలక వర్గం గడువు ముగిసింది. ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తేవడం ద్వారా కొత్త జీపీలను ఏర్పాటు చేసింది. 327 పంచాయతీల నుంచి ధర్మపురి, రాయికల్ మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడం, మరికొన్ని పంచాయతీలను వాటిలో కలపడం ద్వారా పంచాయతీల సంఖ్య 320కి చేరింది. మరో 60 కొత్త జీపీలను ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 380కి చేరింది. అలాగే ఇప్పటివరకు జిల్లాలో 4లక్షల87వేల165 మంది ఓటర్లున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే షెడ్యూల్‌లోగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో జిల్లా పంచాయతీ శాఖ అధికారులు జిల్లాలో నాలుగువేల బ్యాలెట్ బాక్సులు మహారాష్ట్ర నుంచి తెప్పించి అందుబాటులో ఉంచారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో అధికారులు పంచాయతీ ఎన్నికలపై పూర్తి దృష్టి సారించారు. రిజర్వేషన్ల పెంపు కూడా 50శాతం మించి ఉండకూడదని కోర్టు తీర్పునివ్వడంతో బీసీ ఓటర్ల గణనలో ఉన్న చిక్కుముడులు దాదాపుగా వీడాయి. ఫలితంగా పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి నుంచి నెలరోజుల్లో ఎన్నికలు కూడా పూర్తి కానున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు తుదిజాబితా ప్రకటించిన రోజునుంచి 25రోజులు మాత్రమే పోలింగ్‌కు గడువు ఉంటుంది. అంటే జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.