గ్రామాల్లో పచ్చదనం పెంపునకు కృషి

హరితహారం మొక్కలు పెంచిన వారికి ప్రోత్సాహక బహుమతులు

నిజామాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): హరతహారంపై ప్రజలో చైతన్యం తీసుకురావడానికి, నాటిన మొక్కలను కాపాడేందుకు ప్రజల పాత్రను గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం మొక్కలు నాటి, వాటిని సంరక్షించే వారికి వ్యక్తి గతంగా కాని లేదా ప్రభుత్వ శాఖ పరంగా కాని ఎంపిక చేసిన అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని మరింత పగడ్బందీగా నిర్వహించేదుకు ఈ వినూత్న కార్యచరణకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. హరితహారం కార్యక్రమం కేవలం ప్రభుత్వరంగ సంస్థలకే పరిమితం కాకుండా, ఇందులో ప్రజల పాత్ర కూడా ప్రధానంగా ఉండేలా సర్కారు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం ప్రజలను చైతన్య పర్చేందుకు అవార్డుల పక్రియ ప్రవేశపెడుతుందని వెల్లడించారు.ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తెలంగాణ హరితమిత్రా అవార్డుల వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో రూ.15 కోట్ల అవార్డులు అందజేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని డీఎఫ్‌వో వెల్లడించారు. అందుకోసం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని, అందులో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారన్నారు. ఆయనతో పాటు అటవీ శాఖ, ఇతర శాఖల సిబ్బంది సభ్యులుగా ఉంటారు. జూన్‌ 10వ తేదీ వరకు ఫారెస్టు కార్యాలయంలో అందజేసే దరఖాస్తు ఫారాలను తీసుకొని వాటిలో సూచించిన ప్రకారం పూరించాల్సి ఉంటుందని డీఎఫ్‌వో వెల్లడించారు. అయితే ఈ అవార్డులో రాష్ట్రస్థాయి, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఎంపిక చేస్తారని అన్నారు. కమిటీ పరిశీలించిన అనంతరం ఎంపిక చేసిన వారికి రాష్ట్రా స్థాయిలో రూ.2 లక్షలు, జిల్లా స్థాయిలో లక్ష రూపాయలుగా అందజేస్తారని డీఎఫ్‌వో తెలిపారు. దీంతోపాటు బెస్ట్‌ గ్రామ పంచాయతీ కింద ఎంపికైతే రూ.5 లక్షలు, రెండో కేటగిరీలో రూ.3 లక్షలు అవార్డులు అందజేస్తారని ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం తలపెట్టిన హరిత తెలంగాణలో భాగస్వాములుకావాలని ఈ సందర్భంగా డీఎఫ్‌వో పేర్కొన్నారు. దీనివల్ల గ్రామాలు కూడా పచ్చదనంలో పోటీ పడతాయని అన్నారు.