గ్రామాల అభివృద్దిని కోరుకుంటున్న ప్రజలు
పంచాయితీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం
ప్రజల నమ్మకాన్ని నిలుపుతామన్న మాజీమంత్రులు
ఆదిలాబాద్,జనవరి31(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా దాదాపు అన్ని గ్రామాలను టిఆర్‌ఎస్‌కు కట్టబెట్టడంపై మాజీమంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ది వేంగగా జరగాలని, సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నారని వేర్వేరుగా అన్నారు. ఇది కెసిఆర్ పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధించారు. 465 పంచాయతీలకు గానూ గులాబీ మద్దతుదారులు గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటితప్ప అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం గులాబీ జెండా ఎగిరింది. బుధవారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో 163 గ్రామపంచాయతీలకు గానూ అత్యధిక శాతం బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడం చూస్తే ప్రజల్లో కెసిఆర్ పట్ల ఉన్న వివ్వాసం బలపడిందని జోగురామన్న అన్నారు. జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగగా పార్టీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో విజయంసాధించారు. జిల్లా వ్యాప్తంగా నాన్ షెడ్యూల్డ్, షెడ్యూల్డ్ ఏరియాలో సైతం ప్రజలు అండగా నిలిచారు.మూడో విడతలో భాగంగా ఆరు మండలాల్లో 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా 55 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం 108 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ విడతలో 163 సర్పంచ్ స్థానాలకు గానూ 119 జీపీల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు.ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం గులాబీ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో గెలుపొందారు. ఇదంతా కేవలం కెసిఆర్ పట్ల ప్రజలకున్న నమ్మకమని మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇదే స్పూర్తితో గ్రామాలను అభివృద్దిలో ముందుకు తీసుకుని వెళతామని అన్నారు.