గ్రామాల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
చిత్తశుద్ధితో పనిచేసి పల్లె ప్రగతికి బాటలు వేయాలి
ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియమిస్తున్నాం
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ జనంసాక్షి :- నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామ పాలనకు కొత్త రూపు తెస్తున్నామని…గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులు చిత్తశుద్దితో పనిచేయాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు ఇవ్వడంపై టీఎన్‌జీఓ, కార్యదర్శుల సంఘం నేతలు మంత్రి జూపల్లి కృష్ణారావును గురువారం సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నామని… పల్లె ప్రగతికి ఉద్యోగులంతా తమ వంతు కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిదులు, ఉద్యోగులు అంతా కలిసి కట్టుగా పనిచేసి స్వచ్ఛగ్రామాలుగా మార్చాలని…ఉపాధిహామీ, హరితహారం కార్యక్రమాలతో తమ గ్రామాలను ఆదర్శంగా నిలపాలని సూచించారు. కార్యదర్శుల నియామకంలో అర్హులైన బిల్ కలెక్టర్లు, కారోబార్‌లకు వెయిటేజీ ఇవ్వాలని టీఎన్ జీఓ అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రాజేందర్, కార్యదర్శుల సంఘం నేతలు పర్వతాలు, శేషు తదితరులు మంత్రికి వినతి పత్రం అందజేశారు.