గ్రీస్‌కు ఊరట
– బెయిల్‌అవుట్‌కు ఈయూ ఆమోదం
హైదరాబాద్ జూలై 13 (జనంసాక్షి):
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రీస్‌కు మరోసారి రుణసదుపాయం కల్పించి సహాయం చేసేందుకు యూరోజోన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో గ్రీస్ యూరోజోన్ నుంచి తప్పుకోవాల్సిన సమస్య నుంచి బయటపడింది. గ్రీస్‌కు కొత్త ఉద్దీపన లభించింది. అయితే కఠిన షరతులతో కొత్త సంస్కరణలు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గ్రీస్ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. గ్రీస్‌కు ఆర్థిక సంస్కరణలు, కఠిన షరతులతో మూడోవిడత బెయిల్ ఔట్ రుణం ఇవ్వడానికి యూరోజోన్ నేతలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ సోమవారం వెల్లడించారు. రుణదాతల కఠిన షరతులకు గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ అంగీకారం తెలిపినట్లు ఈయూ నేతలు తెలిపారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో సుదీర్ఘ సమావేశాల అనంతరం గ్రీస్‌ను యూరోజోన్‌లోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రీస్ దాదాపు 320 బిలియన్ యూరోల పీకలలోతు అప్పుల్లో కూరుకొని ఉంది.
ప్రజాభిప్రాయ సేకరణలో వద్దనప్పటికీ..
రుణదాతలకు డబ్బు చెల్లించలేక తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న గ్రీస్ యూరోజోన్ నుంచి బయటకు వస్తే సొంతగా కరెన్సీ ముద్రించుకొని తిరిగి ఆర్థిక కార్యకలాపాలు నడిపించాల్సి ఉండేది. అయితే దాని వల్ల గ్రీస్ మరింత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూరోజోన్‌లో తిరిగి కొనసాగాలంటే రుణదాతల కఠిన షరతులను అంగీకరించాలి. రుణదాతల షరతులను అంగీకరించాలా.. వద్దా ? అనే అంశంలో గ్రీస్ ప్రజలు వద్దు అని తీర్పునిచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు రుణదాతల షరతులను తోసిపుచ్చారు. కానీ యూరోజోన్ నుంచి తప్పుకుంటే గ్రీస్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. దీంతో గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ గ్రీస్‌ను యూరోజోన్‌లో ఉంచేందుకే ఆసక్తి చూపారు. ఈయూ నేతలను గ్రీస్‌ను యూరోజోన్ నుంచి తొలగించవద్దని, షరతులను అంగీకరిస్తామని సిప్రాస్ అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
మూడేళ్లకు బెయిల్ ఔట్ ప్యాకేజీ
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న గ్రీస్‌కు రుణాన్ని అందించడానికి ఈయూ ఒప్పుకుంది. దీంతో గ్రీస్‌కు మూడేళ్ల బెయిల్ ఔట్ ప్యాకేజీగా సుమారు 50బిలియన్ యూరోలు ఉండొచ్చని సమాచారం. గత అయిదేళ్లలో గ్రీస్‌కు రుణసహాయం చేయడం మూడోసారి. ఈ రుణ సహాయానికి యూరోజోన్ గ్రీస్‌పై కఠిన షరతులు విధించింది. కార్మిక చట్టాలు, పెన్షనర్ల డబ్బు విషయంలో నిబంధనలు మరింత కఠిన తరం కానున్నాయి. ప్రజలపై వ్యాట్ మోత ఎక్కువగా పడనుంది. వీటితో పాటు మరిన్ని ఆర్థిక సంస్కరణలు అమలులోకి రానున్నాయి. గ్రీస్‌లో గత రెండు వారాలుగా బ్యాంకులు మూతపడ్డాయి. ఏటీఎంలలో రోజుకు కేవలం 60 యూరోలు తీసుకోవాలనే నిబంధనతో ప్రజలు ఆహారం, మందులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కాబట్టి బెయిల్ ఔట్ ప్యాకేజీలో ప్రతిపాదించిన సహాయంలో 25బిలియన్ యూరోలు బ్యాంకుల కోసం వినియోగించనున్నారు. గ్రీస్ కఠిన నియమ నిబంధనలతో ఆర్థికంగా నిలదొక్కుకొని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాల్సి ఉంటుంది.
ఈయూ నిర్ణయంతో లాభాల బాటలో స్టాక్‌మార్కెట్లు
గ్రీసు ప్రభావం స్టాక్‌మార్కెట్లపై పడింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రీస్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వడానికి యూరోజోన్ అంగీకరించడంతో గ్రీస్ ప్రజలతో పాటు ప్రపంచ మార్కెట్లు సంతోషిస్తున్నాయి. ముఖ్యంగా భారత స్టాక్‌మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 299పాయింట్లు లాభపడి 27,961 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 99 పాయింట్లు బలపడి 8459 పాయింట్ల వద్ద ముగిశాయి.