గ్రూప్స్ మాత్రమే జీవితం కాదు
హైదరాబాద్,సెప్టెంబర్12(జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి స్ఫూర్తిని కనబరిచారో రాష్ట్ర అభివృద్ధిలో కూడా అలాంటి స్ఫూర్తినే చూపించాలన్నారు మేధావులు. గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రూప్స్ సిలబస్, ప్రిపరేషన్ విధానంపై జరిగిన అవగాహన సదస్సులో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, టీఎస్ పీఎస్సీ సభ్యులు విఠల్, బానోత్ చంద్రావతి, ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై విద్యార్థులకు విపులంగా వివరించారు. ఏ విధంగా ప్రిపేర్ కావాలో మెళకువల చెప్పారు.
తెలంగాణలో రాజకీయ పరివర్తన జరిగిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వలస ఆధిపత్యం నుంచి బయటపడేందుకు ఉద్యమాలు జరిగాయని వివరించారు. పోటీ పరీక్షలను సీరియస్ గా తీసుకుని రాయాలేగానీ, అవే అంతిమం కాకూడదన్నారు. పోటీ పరీక్షల్లో విఫలమయ్యామని అభ్యర్థులు కుంగిపోవద్దని గ్రూప్స్ మాత్రమే జీవితం కాదని ఆయన సూచించారు.
తెలంగాణ ఇతివృత్తంగా, ఆఫీసర్లుగా వెళ్ళిన తర్వాత తెలంగాణ సమాజ అభివృద్ధి కొరకు చేయాల్సిన పనిని పరిగణలోకి తీసుకొని సిలబస్ తయారు చేశామని ప్రొఫెసర్ హారగోపాల్ చెప్పారు.ఉద్యోగాలు కల్పనలో తెలంగాణ ప్రభుత్వం, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడా అవినీతికి తావు లేకుండా పనిచేస్తోందన్నారు టీఎస్పీఎస్సీ సభ్యులు విఠల్, చంద్రావతి. కమిషన్ సభ్యుల పేర్లు చెప్పుకొని ఎవరైనా బ్రోకరిజం చేస్తే చంచల్ గూడ జైలుకు పంపుతామని హెచ్చరించారు.
ఇలాంటి కార్యక్రమాలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రూప్స్ అభ్యర్ధులు అభిప్రాయపడ్డారు. గతంలో గ్రూప్స్ అంటే గందరగోళం ఉండేదని , అవినీతికి మారుపేరుగా ఉండేదన్నారు. టిఎస్‌పిఎస్‌సీ సభ్యులు మాట్లాడిన తర్వాత తమకు ప్రభుత్వంపై భరోసా వచ్చిందంటున్నారు.