గ్రూప్ వన్ మహిళాల కోటాలో సమాంతర రిజర్వేషన్ల తీర్పు హర్షణీయం
గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య మహిళా అధ్యక్షురాలు సుంకరి సరోజ
మునగాల సెప్టెంబర్24(జనంసాక్షి): గ్రూప్ వన్ పోస్టుల భర్తీలలో మహిళా కోటాలో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని టీఎస్ పిఎస్పీని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య మహిళా అధ్యక్షురాలు సుంకరి సరోజ శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో భర్తీకి టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇందులో మహిళలకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో మహిళా కోట 33% రిజర్వేషన్ను వర్టికల్ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వాసి బాలకృష్ణ, కోడెపాక రోహిత్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ మీ మాధవి దేవి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అడిషనల్ తరపు న్యాయవాది, మునగాల మండల పరిధిలోని విజయరాఘవపురం గ్రామానికి చెందిన సుంకర చంద్రయ్య వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు సుస్పష్టమైన తీర్పులు ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్పీ తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఉద్యోగాల కల్పన మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో గ్రూప్ వన్ పోస్టుల భర్తీ చేపట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య మహిళా అధ్యక్షురాలు సుంకరి సరోజ మాట్లాడుతూ, పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. అందువల్ల మహిళలకు సమాంతర రిజర్వేషన్ల ప్రక్రియలో న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు.