గ్రేటర్ ఎన్నికలకు ముందే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
– రాసలీలల మంత్రిని సాగనంపేందుకు సీఎం కెసిఆర్ నిర్ణయం!
– పునర్వ్యవస్థీకరణకు ముందే రాజీనామా కోరే అవకాశం
– ఇప్పటికే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రి
– దానం నాగేందర్, వినయ్ భాస్కర్, కవిత మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం
– ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి లకు విశ్రాంతినిచ్చే అవకాశం
-పద్మారావుకు మంత్రిగా అవకాశం వస్తే శ్రీనివాస్ గౌడ్‌కు విశ్రాంతి
– మంత్రివర్గంలోకి కవిత సస్పెన్స్..
– గ్రేటర్ ఎన్నికలే నేపథ్యంగా జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్(జనంసాక్షి): దుబ్బాక ఉపఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల విూద దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నగర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సవిూపిస్తున్నందున నగరంలో జరుగుచున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయడంతో పాటు నగరంలోని పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ దిశగానే రాబోయే కొద్ది రోజుల్లో మంత్రి వర్గంలో భారీ మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే ఆరోపణలను ఎదుర్కొంటున్న రాసలీలల మంత్రిని మంత్రివర్గం నుండి తొలగించాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే సదరు మంత్రిని రాజీనామా కోరనున్నారని తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి విూద ఆగ్రహంతో ఉన్న సిఎం కెసిఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించడంతో గత కొన్ని రోజులుగా సదరు మంత్రి అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో నగరం నుండి దానం నాగేందర్ కు బెర్త్ దాదాపు ఖాయమవగా డిప్యూటీ స్పీకర్ గా ఉన్న టి. పద్మారావు విషయంలో సందిగ్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ పద్మారావు ను మంత్రివర్గంలోకి తీసుకుంటే మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ గా ఎన్నికైన కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటే సామాజిక సవిూకరణాలను దృష్టిలో ఉంచుకొని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రివర్గం నుండి పక్కకు జరపడం ఖాయం అనిపిస్తుంది. అక్కడి నుండి దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. భారీ మెజారిటీతో ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను మంత్రిగా తీసుకుంటే జిల్లాలతో పాటు సామాజిక సవిూకరణల సర్దుబాటులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుండి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి పదవికి దూరం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మంత్రి వర్గంలోకి తీసుకునేవారి జాబితాలో సీనియర్ శాసన సభ్యులు, మాజీ మంత్రి జోగు రామన్న పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ సామాజిక సవిూకరణాల దృష్ట్యా అవకాశం దక్కేలా లేదు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కావడంతో పరిస్థితులను ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు.