గ్రేటర్ ఎన్నికల్లో ఆరేళ్ల అభివృద్దిపైనే ప్రచారం
అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే చాన్స్
దుబ్బాక ఓటమి ప్రభావం పడకుండా జాగ్రత్తలు
వ్యూహాత్మక అడుగులు వేస్తున్న టిఆర్‌ఎస్
హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక గడిచిన ఆరేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పడే నగరాన్ని ఫెక్సీలు, ¬ర్డింగ్‌లతో ముంచెత్తుతున్నారు. ఇక వరద సహాయక చర్యలు, మరమ్మతులను వేగంగా పూర్తి చేయడంతోపాటు, ఎక్కువ మంది ప్రజలు కోరుకునే పనులకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నట్లు పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. అందులో భాగంగానే ప్రజలు ఇబ్బందిగా భావించే గుంతల పూడ్చివేత, గతుకుల రోడ్లకు అతుకులు వేసే పక్రియ పరుగులు పెడుతోందని అంటున్నారు. గడిచిన కొంత కాలంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల కసరత్తులో నిమగ్నమైన టీఆర్‌ఎస్ ఈసారి 150 డివిజన్లకుగాను 130 స్థానాలను గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో 99 స్థానాల వద్ద ఆగిపోయిన నేపథ్యంలో ఈసారి సెంచరీ దాటాలనే పట్టుదలతో ఉన్నట్లు పేర్కొంటున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఏమాత్రం ఆషామాషీగా తీసుకోవద్దని అధిష్ఠానం నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. తప్పనిసరిగా గెలిచేవారికే టికెట్లు ఇవ్వాలని, మొహమాటానికి వెళ్లి ఓడిపోయే వారికి టికెట్ ఇవ్వొద్దని నిర్ణయించారు. ప్రజల్లో మంచిపేరు లేకపోతే సిటింగ్ కార్పొరేటర్లను సైతం పక్కన పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులకు అప్పగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన అనూహ్య పరాజయంతో అధికార టీఆర్‌ఎస్ అప్రమత్తమయ్యింది. గడచిన ఆరేళ్లలో
చవిచూసిన మొట్టమొదటి అపజయంతో నెలకొన్న నైరాశ్యం నుంచి కార్యకర్తలను బయట పడేయడంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఏదైనా గట్టి విజయంతో దుబ్బాక ఓటమికి బదులివ్వడమే సరైన పరిష్కారంగా భావిస్తోంది. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వేదిక చేసుకోవాలని నిర్ణయించింది. అందుకు గడువుకు ముందే ఎన్నికలను నిర్వహించబోతున్నది. వపిక్షాలు ఊపిరి తీసుకోకుండా ముందుగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలా చర్యలు తీఉకుంది. దుబ్బాక ఓటమిని
మరిపించేలా జీహెచ్‌ఎంసీలో ఘనవిజయాన్ని నమోదు చేయాలని యోచిస్తోంది. తద్వారా దుబ్బాకలో ప్రత్యేక పరిస్థితుల్లోనే అక్కడ ఓటమి పాలయ్యమాన్న సందేశం ఇవ్వాలని చూస్తోంది. కారు స్పీడు ఏమాత్రం తగ్గలేదని రాష్ట్ర ప్రజానీకానికి చాటిచెప్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం త్వరగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహణకు ఎత్తులు వేసింది. వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నిక ముగిసిన వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తెరలేచేలా అధికార పార్టీ మొదట వ్యూహరచన చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద నవంబరు లేదా డిసెంబరులో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధత కూడా వ్యక్తం చేసింది. కానీ, అనూహ్యంగా అక్టోబరు రెండో వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తడం.. ఎన్నికల యోచన నుంచి కొంత వెనక్కి తగ్గేలా చేశాయని భావించారు. అయితే డిసెంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగకుండా చూసుకున్నట్లు అర్థం అవుతోంది. దీనికితోడు దుబ్బాకలోనూ పార్టీ పరిస్థితి ఆశించినంత మెరుగ్గా లేదనే అంచనాకు వచ్చారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి 10 వరకు ఉన్న నేపథ్యంలో అంతకు ముందే డిసెంబర్ 1న నిర్వహించేలా ప్లాన్ చేశారు. దుబ్బాకలో బీజేపీ చేతిలో ఎదురైన ఓటమితో గ్రేటర్ ఎన్నికలపై టీఆర్‌ఎస్ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. డిసెంబరులోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని, ఆలస్యం చేసే కొద్దీ ఇతర పార్టీలకు అవకాశమిచ్చినట్లు అవుతుందని టీఆర్‌ఎస్ ముఖ్యులు భావించిన మేరకు షెడ్యూల్ విడుదల అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నగరానికి చెందిన కొందరు ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత భేటీలో ప్రస్తావించినట్లు తెలిసింది. వరదల తర్వాత గ్రేటర్ పరిధిలో నిర్వహించిన సర్వేల్లో గతంలో కంటే టీఆర్‌ఎస్ స్వల్పంగా వెనకబడినప్పటికీ.. బీజేపీ,కాంగ్రెస్‌ల కన్నా చాలా ముందంజలో ఉందని, ఈ మేరకు ఆయా పార్టీలు సిద్ధం కాకముందే ఎన్నికలు ముగించాలనే ఉద్దేశాన్ని ఆయన వెల్లడించారని సమాచారం. దీనికితోడు టిఆర్‌ఎస్ నుంచి వలసలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. దుబ్బాక ఓటమితో కుంగిపోవాల్సిన పనిలేదని, అక్కడి పరిస్థితులు, గ్రేటర్ వాతావరణం భిన్నమైనవని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.