గ్రేటర్ ఎన్నికల్లో ఓంటరి పోరాటం
– పొత్తుల్లేవు
– సీఎం కేసీఆర్
– తెరాస తీర్ధం పుచ్చుకున్న విజయరామారావు
హైదరాబాద్,జనవరి 3(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 6 నుంచి డివిజన్ బాధ్యులు ప్రచారం ప్రారంభించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 80-85 సీట్లు గెలుస్తామని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని, గత పాలకుల వల్లే హైదరాబాద్‌లో సమస్యలు నెలకొన్నాయన్నారు. అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగానే ఉంటుందని, దీనిలో ఎవరి సిఫార్సులు అంగీకరించేది లేదన్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలను ఏకగ్రీవంగా గెలిపించుకోవడం ఓ చరిత్రని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నిక బాధ్యతను మంత్రి హరీశ్‌రావు తీసుకుంటారన్నారు. జిల్లాల నేతలు తమ ఓటర్లు ఎక్కడుంటే అక్కడే ప్రచారం ప్రారంభించాలని సూచించారు. ఎంఐఎంతో ఎన్నికల పొత్తుపై ఇప్పటివరకు ఎలాంటి అవగాహన లేదని సీఎం అన్నారు.టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. గ్రేటర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల పర్యవేక్షణ కేటీఆర్, కవితలకు అప్పగించారు. నారాయణఖేఢ్ బైపోల్ బాధ్యత హరీష్‌కు అప్పగించారు. 110 స్థానాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రేటర్ లో మెజార్టీ స్థానాలు టీఆర్ ఎస్ వే అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందేవిూలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను ఇంతవరకూ అమలు చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి మొత్తం తెలుగుదేశం హయాంలో జరిగిందేనన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీమంత్రి విజయరామారావు
గ్రేటర్ హైదరాబాద్‌లో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి విజయరామారావు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో
టీఆర్‌ఎస్‌లో చేరారు.విజయ రామారావుకు, కేసీఆర్ టీఆర్‌ఎస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా హయాంలో విజయరామారావు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి
గెలుపొంది మంత్రిగా పనిచేశారు. తెలంగాణ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజయరామారావును ఆయన నివాసంలో కలుసుకొని పార్టీలోకి ఆహ్వానించిన
విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి విజయరామారావును బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. కాగా ఇటీవలే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాలో పార్టీ మారారు. పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయరామారావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో తెలంగాణ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రేటర్ ఎన్నికల్లో వందసీట్లు మావే : తలసాని
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు తమవేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యావద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.సమావేశం ముగిసిన అనంతరం తలసాని మాట్లాడుతూ.. ఇప్పుడు అందరి చూపు తెలంగాణ భవన్ వైపే ఉందని తెలిపారు. పాత, కొత్త నాయకులం అందరం కలిసి పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారని తలసాని పేర్కొన్నారు. ప్రజలకు ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినవే చెబుతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమకార్యక్రమాలు, చేయబోయ పనులను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తన నియోజకవర్గంలో 395 డుబల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించామని తెలిపారు. వచ్చే ఏడాది వెయ్యి ఇళ్లు నిర్మిస్తామన్నారు. 4 నుంచి 6 కేజీల వరకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని చెప్పారు. ట్రాపిక్ సమస్య లేకుండా, సిగ్నల్స్ పడకుండా .. 25 కోట్ల రూపాయలతో స్కైవేల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెబుతూ ముందుకు వెళ్తామని చెప్పారు. 100 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఓట్ల తొలగింపుపై విపక్షాలు అవాస్తవాలు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.