గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం

18వేల 202 బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటు
బ్యాలెట్‌ పత్రాల ద్వారా పోలింగ్‌
పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిస్ట నిఘా, భద్రత
వివరాలు వెల్లడించిన కమిషనర్‌ పార్థసారథి
హైదరాబాద్‌,నవంబర్‌29 (జనం సాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పద్దతిలో జరుగనున్నాయి,. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోసం 18వేల 202 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి తెలిపారు.  కొవిడ్‌-19కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.  మొత్తం 9,101 పోలింగ్‌ బూత్‌లు, 74 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలతో  జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది.    మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో పార్థసారథి విూడియాతో మాట్లాడారు.
‘అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ పటిష్టనిఘా ఏర్పాటు చేశాం.  పోలింగ్‌ పర్యవేక్షణకు 661 మంది జోనల్‌ అధికారులు ఉంటారు.  మొత్తం 28,683 బ్యాలెట్‌ బాక్సులు వాడుతున్నాం.  మొత్తం 81,88,686 బ్యాలెట్‌ పత్రాలు ముద్రించాం.  ఎన్నికల నియమావళి అమలుకు 19 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పోలింగ్‌ విధుల్లో 45వేల మంది సిబ్బందిని కేటాయించామని వివరించారు.  ప్రతి సర్కిల్‌కు ఇద్దరు ప్లయింగ్‌ స్క్వాడ్‌ ఉంటారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలి. శానిటైజర్‌ వాడాలి. సామాజిక దూరం పాటించాలని కమిషనర్‌ కోరారు. ఇప్పటి వరకు 92.04 శాతం పోలింగ్‌ స్లిప్పుల పంపిణీ పూర్తయ్యిందన్నారు. మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. రామచంద్రాపురం డివిజన్‌లో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల కోసం 2వేల 629 దరఖాస్తులు వచ్చాయి.  అత్యధికంగా జంగమ్మెట్‌ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదు డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారని’ కమిషనర్‌ పేర్కొన్నారు.   డిసెంబర్‌ 4న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.  ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌-150, బీజేపీ-149, కాంగ్రెస్‌-146, టీడీపీ 106, ఎంఐఎం-51  డివిజన్లలో పోటీ చేస్తున్నాయి.