గ్రేటర్ పీఠం మాదే
– కేటీఆర్ ధీమా
హైదరాబాద్‌జనవరి31(జనంసాక్షి):హైదరాబాద్ గ్రేటర్ పీఠం టీఆర్‌ఎస్‌దే మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలంతా టీఆర్‌ఎస్ కు ఓటు వేయడానికి, తెలంగాణ వ్యతిరేక శక్తులను తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని, గ్రేటర్ పీఠంపై టీఆర్‌ఎస్ జెండా తప్పకుండా ఎగురుతదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ వల్లనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత కావాలన్నారు. ప్రజలు విచక్షణతో తీర్పు ఇస్తారని తమకు విశ్వాసముందని మంత్రి పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని రకాల పద్ధతుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించామని వివరించారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని అరిగిపోయిన రికార్డు వేస్తున్న చంద్రబాబు.. 1996 నుంచి ఇదే ప్రచారం చేసినా 2004లో ప్రజలు తిరస్కరించారని, ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు. టీడీపీ ప్రాంతీయ పార్టీ అని, అది ఆంధ్రా ప్రాంతానికే పరిమితమవుతందన్నారు. చంద్రబాబు కూడా ఆంధ్రాకే పరిమితమన్నారు. ఆంధ్రా కొత్త రాజధాని అమరావతికి నిధులు తెచ్చుకోలేని వారు హైదరాబాద్ కు ఏం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ కు ఓటు వేయడానికి వంద కారణాలున్నాయని, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇండ్ల పథకంలో మొండిచేయి చూపించారని, తాము నిలదీయడంతో కొన్ని ఇండ్లు మంజూరు చేశారని చెప్పారు. ఐనా, ఇతర రాష్ట్రాలకు ఎన్ని ఇస్తున్నారు.. తెలంగాణకు ఎన్ని ఇస్తున్నారో చూస్తేనే వివక్ష తెలుస్తుందన్నారు. స్మార్ట్ సిటీల్లోనూ తెలంగాణకు మంజూరు చేయలేదన్నారు. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ శకటానికి చోటు కల్పించలేదన్నారు. ప్రధాని మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా.. తెలంగాణకు గంట కూడా కేటాయించలేదని, ఒక్కసారి కూడా ముఖం చూపించలేదని విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. మున్సిపల్ శాఖను తనకు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ శాఖను ఛాలెంజ్ గా తీసుకుని హైదరాబాద్ లోని అన్ని సమస్యలను పరిష్కారిస్తానని హావిూ ఇచ్చారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా, ప్రపంచంలోని పలు దేశాలు తిరిగి వచ్చిన యువకుడిగా మారుతున్న కాలానికి అనుగుణంగా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు.