ఘనంగా కోటసత్తెమ్మ ఉత్సవాలు
విజయనగరం, జూలై 30 : స్థానిక రామానాయుడు రోడ్డులో కొలువై ఉన్న సత్తెమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గణేష్ పూజతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో భాగంగా పంచామృతాభిషేకము, లలితా సహస్త్రనామ పారాయణం, 108 కలశాలతో పూజ, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో వచ్చి దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించుకున్నారు. ఆలయ ధర్మకర్త ఒబ్బిలిశెట్టి వెంకటరమణమూర్తి (రామ్జీ), భారతి దంపతులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ధర్మకర్త రామ్జీ మాట్లాడుతూ ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే ఈ పండుగ వేడుకలను ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మూడు రోజుల పాటు జరిగే పండుగ మహోత్సవాలు రెండవ రోజున సోమవారం ఉదయం శ్రీ శ్రీనివాస సహస్త్ర నామాలతో తులసి పూజ జరుగుతుందన్నారు. ఈ పూజలో 108 మంది మహిళలు పాల్గొంటారన్నారు. ఉత్సవాల చివరి రోజైన మంగళవారం ఉదయం వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని పూజించి, సాయంత్రం అమ్మవారికి తెప్పొత్సవం, ఘటాలు, ఊరేగింపు, అనంతరం ఉయ్యాల కంబాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ కన్వినర్ ఎం భాస్కరరావు, కమిటీ ప్రతినిధులు పి. సీతారామయ్యశెట్టి, కె.వి.ఆర్.కోటేశ్‌వరరావులతో పాటు పట్టణంలోని పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక మంగలివీధి, తుపాకుల వీధి, డాబాతోట, చిన్నవీధి, కర్రల మార్కెట్, పి.డబ్ల్యు మార్కెట్, ఉల్లివీధి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.