ఘనంగా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు “మిలాద్-ఉన్-నబీ”
హుస్నాబాద్ 14 అక్టోబర్ జనంసాక్షి
మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా,అనంత కరుణామయుడైన అల్లాహ్… సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నకున్నట్టు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్ షరీఫ్‌లో చెప్పబడింది. విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసం కాదని సర్వ కోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో తెలిపారు. విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్ ద్వారా ఏది వినేవారే అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో ముందుగానే వివరించారు. మరో సాక్ష్యం ఏంటంటే మహమ్మద్ ప్రవక్త (ఉమ్మి) అక్షరాస్యత తెలియని వారు. ఇది అల్లాహ్ తహ లా మహిమ పవిత్ర ఖురాన్‌ను దైవవాణి రూపంలో ప్రవక్తను అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు అయ్యాయి.
అల్లాహ్‌కు అత్యం ప్రీతి పాత్రులైన మహమ్మద్ (సఅస) ఇస్లాం లో మహమ్మద్ (ప్రవక్త) ఏకోపాసన, మానవులంతా ఒక్కటేనని తారతమ్యాలు లేవని అంతా అల్లాహ్ దాసులేనని ప్రబోధించారు. శాంతి, సహజీవనం, దానం, దైవభీతితో మెలగాలని బోధించారు. ముహమ్మద్ ప్రవక్త (సఅసం) జన్మదినం సందర్భంగా ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని అందరి దేవుడు ఒక్కడే అని
మానవులంతా ఒక్కటే అని చాటిచెప్పారు
మనిషి పుట్టుకరీత్యా, వంశం, ఆస్తి దృష్ట్యా గొప్పవాడు కాలేరని దైవభీతి పరాయణ దృష్ట్యానే గొప్పవాడని చెప్పారు
బానిసత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు
మూఢనమ్మకాలను పారద్రోలారు
తల్లి పాదాల కింద స్వర్గముందని చెప్పి మాతృమూర్తి ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటారు
కూలీవాని చెమట బిందువులు ఆరకముందే కూలీ చెల్లించాలని కష్టజీవులకు అండగా నిలిచారు
నలభై ఏళ్ల వయస్సులో హిరా గుహలో దైవవాణి పొంది ప్రపంచానికి వెలుగులు పంచారు
ఆయనే ఆ మహనీయుడే ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)
ఆయన చేసిన త్యాగాలు అనుపమానమైనవి. బలహీనుల ఆశాజ్యోతిగా, మహిళలకు అండగా, గొప్ప సామాజిక సంస్కర్తగా ప్రవక్త ముహమ్మద్ జీవితం ప్రపంచ ముస్లిములకే కాదు మానవకోటికి మార్గదర్శకం. నేడు మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ముహమ్మద్ ప్రవక్త (సఅసం) ప్రబోధనలు పరిష్కారం చూపిస్తాయి. ఆనాడు మక్కా ప్రజల్లో అలుముకున్న అసమానతలను దేవుని ఏకత్వ నినాదంతో అందరినీ పక్కపక్కనే నిల్చోబెట్టి. ఒక నల్లజాతికి చెందిన నీగ్రో బానిసను కాబా దైవగృహ కాబా గోడలు ఎక్కించి మొట్టమొదటి అజాన్ ఇప్పించి మనుషులంతా సమానమేనని చాటిచెప్పిన ఘనత ముహమ్మద్ (సఅసం)కే దక్కుతుంది. కుటుంబ నిర్వహణ అయినా, పిల్లల పెంపకమైనా, పరిపాలనా వ్యవహారాలైనా, యుద్ధరంగమైనా, సామాజిక వ్యవహారాలైనా, ఆరాధనలైనా అన్నింటిలోనూ సమతూకం పాటించి చూపించారు. సకల రంగాల్లోనూ ప్రవక్త మహనీయులు చూపిన అడుగుజాడలు మనందరికీ శిరోధార్యాలు. ఆయన జీవితాన్ని చదివితే బోధపడుతుంది. ఉపాధ్యాయుడిగా తమ శిష్యబృందానికి బోధించినా, మంచి భర్తగా, ఉత్తమ వైద్యుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రవక్తగా, స్నేహితుడిగా, గొప్ప తండ్రిగా, మంచి వ్యాపారిగా, కాపరిగా ఆయన వ్యవహారశైలి, వ్యక్తిత్వం ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు.వనరుల వినియోగమైనా, దానగుణమైనా, దాంపత్య జీవితమైనా, అతిథి మర్యాదలైనా, శుచి శుభ్రత విషయంలోనైనా, బంధుత్వ సంబంధాలైనా, పరిపాలనా వ్యవహారాలైనా అన్నింటిలోనూ ప్రవక్త చూపిన బాట బంగారు బాట. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించి చూపారు. 23ఏళ్ల కాలంలో అరబ్బు సామ్రాజ్యంలో ఆదర్శ సమాజాన్ని సుస్థాపించారు.1440 సంవత్సరాల నుంచి నేటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిములు ముహమ్మద్ ప్రవక్త (సఅసం)ను హృదయపూర్వకంగా ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఏ నాయకుడికీ దక్కని గౌరవం ముహమ్మద్ ప్రవక్త మహనీయులకే దక్కిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో. ఏ నాయకుడైనా ఒక రాష్ట్రానికో, దేశానికో, జాతికో పరిమితమవుతాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ విశ్వనాయకుడు.
ఆయనే ఆదర్శం.. ఆయనే మార్గదర్శి..
భార్యతో ఎలా మసలుకోవాలో,దాంపత్య జీవితాన్ని ఎలా గడపాలో ఎలా . పిల్లల్ని క్రమశిక్షణగా ఎలా పెంచాలి?వాళ్లకు సరైన విద్యాబుద్ధులు నేర్పాలంటే ప్రవక్త (సఅసం)ను మినహాయించి ఈ ప్రపంచంలో ఎవ్వరిని ఆదర్శంగా తీసుకున్నా ఒకే ఒక్క రంగంలోనే వారు రాణించారు. కానీ ప్రవక్త (సఅసం) జీవితాన్ని అధ్యయనం చేస్తే జీవితంలోని అన్ని రంగాల్లోనూ మనకు ఆదర్శాలు కనపడతాయి. కుమారుడిగా, భర్తగా, వ్యాపారిగా, పరిపాలకుడిగా, ఉపాధ్యాయుడిగా, బోధకుడిగా, వక్తగా, యజమానిగా, ప్లానర్ గా, నాయకుడిగా ఇలా ఏ బాధ్యతలో ఉన్నవారైనా ప్రవక్త (సఅసం) జీవితంలో మనకు చక్కని మార్గం లభిస్తుంది. ప్రవక్త(సఅసం) జీవితాన్ని ఏ పార్వంలో చదివినా మనకు వెలకట్టలేని ఆచరణాత్మక సందేశం లభిస్తుంది. దైనందిన జీవితంలో ఏ సమస్య ఎదురైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రవక్త (సఅసం) జీవితాచరణలో చక్కని పరిష్కారం వెతుక్కోవచ్చు.
ఆయన మాత్రమే చరిత్రలో ధార్మికంగాను, ప్రాపంచికంగానూ, రెండు విధాలా సఫలుడయిన ఏకైక వ్యక్తి.’’
ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం చరిత్రలో మనకు ఎక్కడా కానరారు. ప్రవక్త (సఅసం) పుట్టిన రోజు( మిలాద్-ఉన్-నబీ )ను పురస్కరించుకొని జామా మసీదులో “ఫాతేహా” నిర్వహించి “దావత్” 600. మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యండి బాషుమియా, యండి హసన్ ప్రధాన కార్యదర్శి, యండి ఆయూబ్ కో ఆప్షన్ సభ్యులు, యండి దస్తగిరి, యండి ఫసియుద్దీన్, యండి షబ్బీర్,యండి కమల్ సాబ్, కె ఆతిక్, కె షఫిక్,యండి అఫ్జల్ పాషా, యండి అక్బర్, యండి ముంతాజ్, యండి సాజిద్,యండి రూహుల్ ఆమిన్,, ఇంతియాజ్, యండి అశ్రఫ్,యండి ఎజాజ్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు