ఘనంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు

తిరుపతి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తిరుపతిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఆ తరువాత ఉత్సవర్లకు సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 7 గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెప్పోత్సవం అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఇసి.శ్రీధర్‌, ఏఈవో తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ జి.రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  వై.రమేష్‌ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.