చందమామ పైకి భారత సంతతి వ్యక్తి
నాసా బృందంలో రాజా చారి
వాషింగ్టన్,డిసెంబరు 11 (జనంసాక్షి):చందమామపై మరోసారి కాలు మోపేందుకు సన్నద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బృందంలో.. భారత సంతతి వ్యక్తికి స్థానం లభించింది. తమ మానవ సహిత చంద్రయాన కార్యక్రమం ‘ఆర్టిమిస్’లో పాల్గొనేందుకు 43 ఏళ్ల రాజా జాన్ వుర్పుత్తూర్ చారి శిక్షణ పొందుతున్నట్టు ఆ సంస్థ ఇటీవల ప్రకటించింది.చంద్రుడి చెంతకు మానవులను చేర్చనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగం కావటం తనకు గర్వకారణమని రాజా చారి ఈ సందర్భంగా ప్రకటించారు. తన తల్లిదండ్రుల ఉత్తమ పెంపకం వల్లే తనకు ఈ అవకాశం లభించిందంటూ.. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈయన ప్రముఖ మస్సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడవిూ, యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం 2017లో నాసాలో చేరిన చారికి.. చారిత్రక అమెరికా మూన్ మిషన్‌లో భాగమయ్యే అవకాశం దక్కింది.తమ చంద్రయాన బృందం అనేక ప్రత్యేకతలతో కూడినదని ఈ సందర్భంగా నాసా వివరించింది. ఈ యాత్ర విజయవంతమైతే.. చంద్రునిపై ఓమహిళ కాలు మోపటం ఇదే తొలిసారి కానుందని సంస్థ తెలిపింది. మొత్తం 18 మంది పాల్గొననున్న ఈ యాత్రలో సగం మంది మహిళలు కావటం విశేషం. వైవిధ్యభరితమైన తమ ఆర్టిమిస్ బృందం వివిధ రంగాలు, నైపుణ్యం, అనుభవం, సామాజిక స్థితులు, నేపథ్యాలతో కూడిన సభ్యులను కలిగిఉందని తెలిపింది.