చంద్రబాబు పీడ పోవాలంటే..  కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి


– విపక్షాల మాటలు విని ఆగంకావొద్దు
– పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం
– గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్‌ పాలనకు తేడా గమనించండి
– గ్రామాల్లో చర్చలు పెట్టండి
– ఏజెన్సీలో ప్రతీ రైతుకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటాం
– కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించేలా చేస్తా
– ఇచ్చోడ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌
అదిలాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి) : తెరాసను ఎదుర్కొనే దమ్ములేక తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రా నేత చంద్రబాబును మళ్లీ తెలంగాణలోకి తీసుకొస్తున్నారని, డిసెంబర్‌ 7న జరగబోయే ఎన్నికల్లో ఓటుద్వారా కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పి.. తెలంగాణకు చంద్రబాబు పీడను శాశ్వితంగా తడిచివేయాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. గురువారం అదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో గురువారం కేసీఆర్‌ ‘ప్రజాఆశీర్వాద’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ తెలంగాణ ద్రోహుల పార్టీతో కాంగ్రెస్‌ చేతులు కలిపిందని మండిపడ్డారు. చంద్రబాబుకు తెలంగాణలో ఏం పనిఅని, తాను మహారాష్ట్రకు వెళ్లి రాజకీయం చేస్తే ఊరుకుంటారా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని కేసీఆర్‌ విమర్శించారు. గిరిజనుల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు. అటవీ భూముల విషయంలో కాంగ్రెస్‌, టీడీపీ కథలు చెబుతున్నాయని, గతంలో ఆ పార్టీలు ఎందుకు  చేయలేకపోయాయని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో తాము గిరిజనుల సమస్యల్ని కొంత మేరకు పరిష్కరించామని చెప్పారు. ఏజెన్సీలో ప్రతీ రైతుకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విపక్షాల మాటలు నమ్మొద్దని, అందరికీ న్యాయం చేస్తానని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు పేదల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాయన్నారు. చెరువులకు మర్మమత్తులు చేసి సాగునీరు అందిస్తున్నామని, గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మధ్య తేడా చూడాలన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, కారు గుర్తుకే ఓటు వేయాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా లోక్‌సభ ఎన్నికల్లోనూ తెరాసకు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే అన్ని హావిూలను నెరవేర్చుకోగలమన్నారు. ఢిల్లీ మెడలు వంచి రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత తనదన్నారు. తనది మొండి పట్టు అని, చివరివరకు పోరాడతానన్నారు. కచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్సేతర, భాజపాయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.