చంద్రబాబు పెత్తనం.. తెలంగాణలో అవసరమా?

 

– ప్రాజెక్టులు కట్టవద్దని బాబు 35లేఖలు రాసిండు

– అలాంటి వ్యక్తిని కాంగ్రెసోళ్లు భుజానికెత్తుకొని వస్తున్నారు

– తెరాస ఓడితే నాకువచ్చే నష్టమేవిూ లేదు

– నేనుపోయిన నాకున్న వ్యవసాయం చేసుకుంటా

– బాబును ఎందుకు మోసుకొస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి

– తెరాస హయాంలో జరిగిన అభివృద్ధిని చూడండి

– వాస్తవాలు తెలుసుకుని ఓటేయాలి

– ఖానాపూర్‌ ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

నిర్మల్‌, నవంబర్‌22(జ‌నంసాక్షి) : కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని పొదరిల్లులా బాగు చేసుకుంటున్నామని, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. గురువారం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. నాలుగేళ్లలో అద్భుత పాలన అందించటంతో ప్రజలంతా తెరాసవైపు ఉన్నారని, దీంతో ఈ బక్క ప్రాణి కేసీఆర్‌ను కొట్టడం చేతకాక, పక్క రాష్ట్రం పోయి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చంద్రబాబును భుజాలపై మోసుకుని వస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. చంద్రబాబునాయుడి పెత్తనం తెలంగాణపై అవసరమా అంటూ ప్రశ్నించారు. నేను ఆరోజే చెప్పానని, కత్తి ఆంధ్రావాడు ఇస్తాడు.. కానీ పొడిచేది తెలంగాణ వాడే నని అన్నానని కేసీఆర్‌ తెలిపారు. కొందరు అమరావతి బానిసలు, మిగిలిన వాళ్లు ఢిల్లీ గులాములని, వీరి పాలనా మనకు కావాల్సింది అంటూ కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. తెరాస ఓడిపోతే నాకు వచ్చే నష్టమేవిూ లేదని, నష్టపోయేది ప్రజలేనన్నారు. గెలిపిస్తే పనిచేస్తామన్నారు. మన ప్రాజెక్టులు కట్టవద్దని చంద్రబాబు కేంద్రానికి 35లేఖలు రాశాడని, మరివారు అధికారంలోకి వస్తే, ఇక్కడ ప్రాజెక్టులు కట్టనిస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ కేసీఆర్‌ ప్రలజకు సూచించారు. తెరాస, కాంగ్రెస్‌, తెదేపా పాలనపై ప్రజలు బేరేజు వేసుకోవాల్సిన అవసరం ఉందని, గ్రామగ్రామాన దీనిపై చర్చ జరగాలని, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ వాళ్లు ఒంటరిగా పోరాడాలన్నారు. కానీ, చంద్రబాబును ఎందుకు మోసుకొస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ఒకసారి నేను ఆయన్ను తరిమి కొట్టానని, ఈసారి విూరే తరిమి కొట్టాల ని ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఖానాపూర్‌ ప్రజల సమస్యలను తనవిగా భావించి పరిష్కరిస్తానన్నారు. ప్రజలంతా కారు గుర్తుపై ఓటు వేసి రేఖానాయక్‌ను గెలిపించాలని, చిన్న చిన్న తగదాలు ఉంటే వాటిని పక్కన పెట్టి, బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేద్దామని ప్రజలను కోరారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. లక్షన్లు చాలా వస్తయి. చాలా పోతయి. ఎవరో గెలవడం ముఖ్యం కాదని, ప్రజలు గెలిచే రాజకీయం వస్తేనే అందరూ బాగుపడ్తరని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ సరిగా లేక మోటార్లు కాలిపోయేవని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ వస్తే కరెంట్‌ ఉండదని పుకార్లు సృష్టించారని, దేశం మొత్తంలో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నది తెలంగాణ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. గతంలో రైతుల గురించి పట్టించుకున్నవారే లేరని కేసీఆర్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకంతో కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ఈ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోందని ఆయన అన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసి తీరతామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. పెన్షన్‌దారులకు రూ. 2,016, వికలాంగులకు రూ.3,016 ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగభృతి కింత నెలకు రూ.3,016 ఇస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. కాంగ్రెస్‌, టీడీపీ నేతలు 58 ఏళ్లు పాలించి సమస్యలన్నీ పెండింగ్‌లో పెట్టారని కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ వస్తే కరెంట్‌ సమస్య పునరావృతం అవడం ఖాయమని ఆయన అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు గెలిపిస్తే వికలాంగులకు రూ.2,016 అందజేస్తామనీ, నిరుద్యోగులకు రూ.3,016 అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం వంటి పథకానికి ఖర్చు ఎంత అవుతుందో అని భయపడుతూనే ప్రారంభించామని వెల్లడించారు. తొలుత దళిత, మైనారిటీలకు వీటిని అందించాలని భావించామని కేసీఆర్‌ అన్నారు.