చంద్రబాబు పై విమర్శలపై టిడిపి మండిపాటు

ఖమ్మం,నవంబర్‌ 21: జలగం వెంకట్రావ్‌ వైఎస్సార్‌ సిపిలో చేరిన సందర్బంగా ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. వైఎస్‌ విజయలక్ష్మి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగించిన  వైఎస్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌, టీడీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో.. వై.ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని, అమల్లోకి తెచ్చిన సంక్షేమపథకాలను విజయలక్ష్మి వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై కానీ, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఎలాంటి విమర్శలు చేయలేదు. సోనియా పేరు ఎత్తకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఎందుకు ఆమె సోనియాను విమర్శించడం లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. టిడిపి నేతలు ఇది వారి చీకటి ఒప్పందానికి సంకేతమని అంటున్నారు. జగన్‌కు బెయిల్‌ కోసమే వారు ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. గతంలో సోనియాపై పలుమార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విజయలక్ష్మి ఖమ్మం సభలో కనీసం వారి ప్రస్తావన కూడా తేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.  పూర్తిగా చంద్రబాబు పాలనపైనే గురిపెట్టి విజయమ్మ  విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కేంద్రంలో చక్రం తప్పినా, రైతులకు ఎలాంటి మేలు చేయలేదని, రైతుల రుణాలు మాఫీ కాలేదని, ఉచిత కరెంటు- ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. రైతులు, గృహ విద్యుత్‌ వినియోగదారులపై కేసులు పెట్టి అరెస్టు చేసిన ఘనత ఆయనదే అని విమర్శించారు.చంద్రబాబు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే స్థితిలో లేరని, అందుకే అసెంబ్లీకి కూడా రానని పాదయాత్ర పేరుతో మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని ఆరోపించారు. వస్తున్నా.. విూ కోసం పేరిట చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర ముఖ్యమంత్రి కూర్చీ కోసమేనని దుయ్యబట్టారు.చంద్రబాబు హయాంలో సీఎం రమేష్‌, నామ నాగేశ్వరరావులాంటి వారికి అనేక చక్కెర ఫ్యాక్టరీలు, ప్రభుత్వ భూములు ఇచ్చారని, ఆయన హయాంలో రూపొందించిన నిబంధనల ప్రకారమే వైఎస్‌ భూములు కేటాయిస్తే జగన్‌ను అరెస్టుజైలుకు పంపారని ఆరోపించారు. రాష్ట్రంలో గ్యాస్‌ను రిలయన్స్‌ కంపెనీలు, గుజరాత్‌ ప్రభుత్వానికి అప్పగించిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు.వైఎస్‌ పాలన సువర్ణయుగమైతే, చంద్రబాబు పాలన శ్మశానయుగం లాంటిదని మండిపడ్డారు. వైఎస్‌ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ రంగానికీ ఉపయోగపడటం లేదని, కరెంటు- ఇవ్వకపోయినా సర్‌ఛార్జీల పేరుతో వేలకోట్లు- ప్రభుత్వం దండుకుంటోందని విమర్శించారు. కేవలం చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ మాత్రమే ఆమె ప్రసంగం కొనసాగడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.