చంద్రబాబు రాకతో హస్తినలో హల్‌చల్‌

మారనున్న రాజకీయ సవిూకరణాలు

బాబు నిర్ణయంతో ప్రాంతీయపార్టీల్లో కదలిక

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హల్‌చల్‌ చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సీఎం చంద్రబాబు సంచనాలు సృష్టిస్తున్నారు. వివిధ ప్రతిపక్షపార్టీల నేతలను కలిసిన తర్వాత ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు కలిసి విూడియాతో మాట్లాడారు. ఆయన ఢిల్లీటూర్‌తో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. జాతీయ రాజకీయ ముఖచిత్రం వారం రోజుల్లో సమూలంగా మారిపోయింది. ఇది నాయుడు ఫ్రంట్‌ అంటూ జాతీయ విూడియా విస్తృత కథనాలు ప్రచురిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత కలిసి

నడవడం పెనుసంచలన మంటూ విూడియా విశ్లేషణలు చేస్తోంది. చంద్రబాబు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1996లో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆయన అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షులు పీవీ నరసింహరావు, సీతారాం కేసరిలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. తర్వాత చంద్రబాబు ఎప్పుడూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేదు. ఇప్పుడు… మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిందని, ఆయన మళ్లీ ప్రధాని అయితే మరింత అన్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే… మోదీ పాలన దేశానికే ముప్పుగా మారిందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఉన్న కూటమితోనే ప్రత్యామ్నాయం సాధ్యమనే అంచనాకు వచ్చి రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేయాలని విపక్షాలన్నీ భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌తో కలిసేందుకు కొందరు ఇష్టపడడం లేదు. దీంతో కూటమి పక్రియ ఓ అడుగు ముందుకు రెండగులు వెనక్కు అన్నట్లు మారింది. దీంతో చంద్రబాబు తీసుకున్న చొరవతో దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. మరికొన్ని రోజుల్లో అన్ని పార్టీలు కలసి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.