చంద్రయాన్‌-2 దక్షిణాసియాకు గర్వకారణం

పాక్‌ తొలి మహిళా వ్యోమగామి నవిూరా సలీం
కరాచీ,సెప్టెంబర్‌9 పాకిస్తాన్‌కు చెందిన తొలి మహిళా వ్యోమగామి నవిూరా సలీం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు అభినందనలు తెలిపారు. చారిత్రాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టినందుకు ఆమె ఇస్రోను అభినందించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ ద్వారా సాప్ట్‌ ల్యాండింగ్‌ కోసం ఇస్రో చేసిన చారిత్రాత్మక ప్రయత్నానికి తాను అభినందనలు తెలియచేస్తున్నానని కరాచీ నుంచి వెలువడే సైన్స్‌ పత్రిక సైనియాకు ఇచ్చిన ప్రకటనలో నవిూరా సలీం పేర్కొన్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగం దక్షిణాసియాలో చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలలో గొప్ప ముందడుగని, ఇది యావత్‌ ప్రపంచ అంతరిక్ష పరిశోధనా పరిశ్రమకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. దక్షిణాసియాకు చెందిన అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలు అద్భుతం. ఏ దేశం ఈ రంగంలో ముందున్నప్పటికీ, భూమిపైన ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ అంతరిక్షంలో అటువంటి రాజకీయ సరిహద్దులు చెరిగిపోయి మనందరినీ సంఘటితం చేస్తాయి అని ఆమె తన ప్రకటనలో అభిప్రాయపడ్డారు. వర్జిన్‌ గలాక్టిక్‌ ద్వారా అంతరిక్ష యాత్ర చేపట్టిన తొలి మహిళా పాకిస్తానీ వ్యోమగామిగా నవిూరా సలీం ఖ్యాతి గడించారు.