చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు: ప్రధాని మోదీ

బెంగుళూరు: చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా చేప‌ట్టిన భార‌త అంత‌రిక్ష ప‌రిశోధనా సంస్థ శాస్త్ర‌వేత్త‌లను ఇవాళ ప్ర‌ధాని మోదీ క‌లిశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆగ‌స్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వం(National Space Day)గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇక చంద్ర‌యాన్‌-3కి చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగిన ప్రాంతాన్ని శివ‌శ‌క్తి(Shiv Shakti)గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ క‌మాండ్ నెట్వ‌ర్క్ మిష‌న్ కంట్రోల్ కాంప్లెక్స్‌లో శాస్త్ర‌వేత్త‌ల‌ను మోదీ క‌లిశారు. చంద్రుడిపై చంద్ర‌యాన్-2 జ్ఞాప‌కాల‌ను వ‌దిలి వెళ్లిన ప్రాంతాన్ని తిరంగాగా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. భార‌త్ సాగించిన ప్ర‌తి ప్ర‌య‌త్నానికి ఇస్రో స్పూర్తిగా నిలుస్తుంద‌న్నారు. విఫ‌ల‌మ‌నేది అన్నింటికీ అంతం కాదు అన్న స‌త్యాన్ని గుర్తు చేస్తుంద‌న్నారు. చంద్ర‌యాన్‌-3లో మ‌హిళా శాస్త్ర‌వేత్త‌లు కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. భ‌విష్య‌త్తు త‌రాల ప్ర‌జ‌లు ఆ శివ‌శ‌క్తి ప్ర‌దేశాన్ని త‌మకు ప్రేర‌ణ‌గా తీసుకుంటార‌ని భావిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల సంక్షేమమే త‌మ నిబ‌ద్ద‌త అని తెలిపారు.