చంబాలో కుప్పకూలిన బ్రిడ్జి

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అయితే ఘటన సమయంలో వంతెనపై రాకపోకలు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

హిమాచల్‌లోని చంబా, పంజాబ్‌లోని పంచకుల ప్రాంతాలను కలిపే వంతెన గురువారం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో వంతెనపై ఓ కారు, బైక్‌, మిని ట్రక్కు ఉన్నాయి. బైక్‌ నదిలో పడిపోగా.. కారు, ట్రక్కు వంతెన మధ్యలో చిక్కుకుపోయాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. సమాచారమందుకున్న జిల్లా కలెక్టర్‌, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఘటనపై జిల్లా కలెక్టర్‌ సుదేశ్‌ కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. నాణ్యత లేని మెటీరియల్‌ ఉపయోగించడం లేదా నిర్మాణంలో లోపాలు జరగడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని సుదేశ్‌ అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వంతెనను 15ఏళ్ల కిందట నిర్మించారు.