చక్కెర ధరల అదుపునకు కేంద్రం చర్యలు

 

న్యూఢిల్లీ,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): చక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రానున్న పండుగల దృష్ట్యా చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని నియంత్రణలో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం పంచదార మిల్లుల నిల్వలపై పరిమితి విధించింది. ఈ పరిమితి ప్రకారం సెప్టెంబరు నెలాఖరు

లోపు పంచదార మిల్లులు తాము ఉత్పత్తి చేసిన చక్కెరలో 21 శాతం కంటే ఎక్కువ తమ వద్ద నిల్వ ఉంచరాదు. అక్టోబరు నాటికి ఈ నిల్వ శాతాన్ని ఎనిమిదికి తగ్గించాలని కేంద్ర ఆహారమంత్రిత్వ శాఖ రాంవిలాస్‌ పాశవాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. సెప్టెంబరు, ఆక్టోబరు మాసాల్లో పండుగలు రానున్న నేపథ్యంలో చక్కెరకు అధిక డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో చక్కెర మిల్లులు మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే అవకాశం ఉన్నందున వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సెప్టెంబరు 30తో ముగియనున్న 2016-17 మార్కెటింగ్‌ సంవత్సరంలో చక్కెర ఉత్పత్తి వినియోగ స్థాయి కంటే తక్కువకు పడిపోయింది. దీంతో మార్కెట్‌లో చక్కెరకు కొరత ఏర్పడే ప్రమాదముంది. దీన్ని అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పైగా చక్కెర వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ధరలు కంట్రోల్‌ అవుతాయని అన్నారు.