చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ప్రభుత్వానికి అందరూ సమానమే అక్బరోద్దీన్ విషయంలో జోక్యం చేసుకోం : సీఎం
హైదరాబాద్, జనవరి 3 (జనంసాక్షి):
కాంగ్రెస్ ప్రభుత్వం లౌకిక ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అందరూ సమానమేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనార్టీలు సహా అందరికీ అండగా ఉంటుందని తెలిపారు. అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి గురువారం స్పందించారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హిందూ దేవుళ్లపై ఎంఐంఎ నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదైనందున అది న్యాయస్థాన పరిధిలోకి వస్తుందని, దానిపై మాట్లాడడం సరికాదని చెప్పారు. ఈ అంశానికి విూడియా అనవసర ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ప్రభుత్వం దృష్టికి రాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ ఏదైనా విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి ఉంటే.. స్థానిక పోలీసులు పరిశీలించి కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కేసులో ప్రత్యేకించి
తాను కానీ, ప్రభుత్వం కానీ పోలీసులకు ఎలాంటి మార్గనిర్దేశకాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయంలో చట్టం తన పని చేసుకుపోతుందన్నారు. ఎలాంటి ఎవరైనా సరే ఒక వర్గాన్నీ, ఒక మతాన్ని కానీ కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు.. విద్వేష వ్యాఖ్యలు చేస్తే వారే బుద్ది చెబుతారని తెలిపారు. అక్బర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ముస్లింలే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారని అన్నారు.