చట్టాలరద్దుకే రైతుల పట్టు
– మరోమాట వద్దు
– సవరణలకు ససేమిరా అన్న కర్షక నేతలు
– జనవరి 4న మరో దఫా చర్చలు
దిల్లీ,డిసెంబరు 30 (జనంసాక్షి): రైతు సంఘాలతో దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర మంత్రుల బృందం ఆరో విడత చర్చలు ముగిశాయి. నాలుగు పాయింట్ల అజెండాపై దాదాపు ఐదు గంటల పాటు సాగిన చర్చల్లో వ్యవసాయచట్టాల రద్దు, కనీస మద్దతు ధర అంశంలో మాత్రం ప్రతిష్టంభన వీడలేదు. రైతులు మాత్రం వ్యవసాయచట్టాల రద్దు, కనీస మద్ధతు దర అంశంపై పట్టుబట్టారు.దీంతో జనవరి 4న మరోసారి అన్నదాతలతో సమావేశమై అపరిష్కృత అంశాలపై చర్చలు జరపాలని నిర్ణయించినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. పర్యావరణ ఆర్డినెన్స్, అలాగే, విద్యుత్ రాయితీల విషయంలో రైతు సంఘాల నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు, మద్దతు ధర విషయంలో రైతుల డిమాండ్ల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం కేంద్రమంత్రి తోమర్ విూడియాతో మాట్లాడుతూ.. దిల్లీలో చలిని దృష్టిలో పెట్టుకొని వృద్ధులు, మహిళలు, చిన్నారులను ఇంటికి పంపాలని రైతు నేతలను కోరినట్టు చెప్పారు. నాలుగు పాయింట్ల అజెండాపై చర్చించగా.. రెండింటిపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. రైతు సంఘాలు మాత్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతున్నాయన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోందని, ఇందుకోసం లిఖితపూర్వక హావిూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. అయితే, రైతు నేతలు మాత్రం ఎంఎస్‌పీని చట్టంలో చేర్చాలని పట్టుబడుతున్నారన్నారుకాగా దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నంత వరకూ ఏ ఒక్క రైతు భూమిని ఎవ్వరూ కాజేయలేరని కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. నూతన చట్టాలతోనూ రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర కొనసాగుతుందని.. మండీలు కూడా మూతపడవని పేర్కొన్నారు. దిల్లీ కిషన్‌గఢ్ ప్రాంతంలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే.. వాటిపై చర్చించి, రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమిత్‌షా స్పష్టంచేశారు. కనీస మద్దతు ధరపై విపక్షాలు చేస్తోన్న అసత్య వార్తలపై అమిత్ షా మండిపడ్డారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర విషయంలో కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. పంటలకు మద్దతు ధర పెరుగుదలపై ఎంతో కాలంగా ఉన్న డిమాండ్‌లను 2014-19 మధ్యకాలంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చిందని అమిత్ షా గుర్తుచేశారు. ఇదిలాఉంటే, రైతుల నిరసనలు కొనసాగుతోన్న వేళ.. వివిధ రాష్ట్రాలకు చెందిన కొందరి రైతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడారు.కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల అమలు ఎలా ఉంటుందో ఒక్క సంవత్సరం చూడాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అప్పటికీ రైతులకు ప్రయోజనం లేదని గుర్తిస్తే వాటిని సవరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేశారు. నిరసనల్లో పాల్గొన్న వారు రైతు కుటుంబాలకు చెందినవారని..వారిపై తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. రైతులకు ప్రయోజనం లేని ఎటువంటి నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకోదని దిల్లీలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సమస్యలన్నింటినీ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని.. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కోరుకుంటున్నారని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రభుత్వంతో చర్చలకు రైతులు ముందుకురావాలని కోరారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతోన్న నేపథ్యంలో వాటిపై అవగాహన కల్పించేందుకు కేంద్రమంత్రులు భారీ స్థాయిలో ర్యాలీలు చేపడుతోన్న విషయం తెలిసిందే.