చట్టాలు ఉపసంహరించే వరకు పోరు ఆగదు

– స్పష్టం చేసిన రైతుసంఘాలు

దిల్లీ,డిసెంబరు 17 (జనంసాక్షి):నూతన వ్యవసాయచట్టాలకు నిరసనగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలను వెనక్కు తీసుకునేదాకా ఆందోళనలు విరమించేది లేదని రైతుసంఘాలు స్పష్టం చేశాయి. కాకా హస్తిన సరిహద్దుల్లో మరో అన్నదాత గుండె ఆగిపోయింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ-హరియాణా సరిహద్దులోని టిక్రీ వద్ద ఉద్యమంలో పాల్గొన్న పంజాబ్‌కు చెందిన ఓ రైతు మృతిచెందారు. గత 20 రోజులుగా టిక్రీ సరిహద్దుల్లోనే ఉన్న అతడు గురువారం ఉదయం విగతజీవిగా కన్పించారు. విపరీతమైన చలి కారణంగానే అతడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా.. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ సిక్కు మత బోధకుడు బలవన్మరణానికి పాల్పడిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. హరియాణాకు చెందిన సంత్‌రామ్‌ సింగ్‌ బుధవారం సింఘు సరిహద్దు వద్ద తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతుల కష్టాన్ని చూసి తాను తట్టుకోలేకపోతున్నానని ఆయన రాసినట్లు ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హరియాణా సీఎం సంతాపం..

సంత్‌రామ్‌ సింగ్‌ మృతి పట్ల హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ విచారం వ్యక్తం చేశారు. ‘బాబా రామ్‌సింగ్‌ మరణం నన్ను ఎంతో కలచివేసింది. ఆయన తన జీవితమంతా ప్రజలకు సేవ చేస్తూ గడిపారు. ఇతరుల కోసమే బతికారు’ అని ఖట్టర్‌ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలియజేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన 22వ రోజుకు చేరింది. కాగా.. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి సగటున రోజుకో అన్నదాత ప్రాణాలు కోల్పోయారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. కొందరు చలితో మరణించగా.. మరికొందరు ఉద్యమం నుంచి తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్తూ వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయినట్లు చెప్పారు. ప్రాణాలర్పించిన రైతుల కోసం ఈ నెల 20న శ్రద్ధాంజలి దినంగా పాటిస్తామని వెల్లడించారు.