చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌

– కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రామ్‌దయాళ్‌
– అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిక
రాయపూర్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : చత్తీష్‌గఢ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి ఎదురు తగిలింది. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రామ్‌దయాళ్‌ శనివారం బీజేపీలో చేరారు. పాలి-తనఖర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధక్షుడు అమిత్‌షా, ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ సమక్షంలో రామ్‌దయాళ్‌ బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. 2000 సంవత్సరంలో అజిత్‌ జోగి పట్టుబట్టడంతో ఆయన 17మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. నాలుగు సార్లు పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్‌దయాళ్‌ బీజేపీలో చేరడం కాంగ్రెస్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాగా, ఆదివాసీ నేత అయిన రామ్‌దయాళ్‌ బీజేపీలో చేరికపై మాట్లాడుతూ, గిరిజనులు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి అనుకూలంగా లేరని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలోని గిరిజన నేతలను నిర్లక్ష్యం చేశారని, వాళ్లు (కాంగ్రెస్‌) చెప్పిన దానికి, చేసిన దానికి పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. అందుకే తాను ఇది జీర్ణించుకోలేకనే కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలిపారు.