చరమాంకానికి తెలంగాణ ఎన్నికలు

పలుచోట్ల జాబితాలో పేరు లేదన్న విమర్శలు
ఎన్నికల సమయంలో ఓటింగ్‌కు దూరంగా ఉద్యోగులు
హైదరాబాద్‌,నవంబర్‌27  ( జనం సాక్షి ) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చరమాంకానికి చేరుకున్నాయి. 30న పోలింగ్‌ జరుగనుండగా 28న సాయంత్రం ప్రచారం ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్నా.. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటరు స్లిప్‌లు అందరికీ అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  ఓటు ఎక్కడ ఉందోనని ఆన్‌లైన్‌లోనైనా చూసుకుందామంటే  డేటా నాట్‌ ఫౌండ్‌ అని వస్తుందని  హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి ఓటర్లు చెబుతున్నారు. 1950 హెల్ప్‌ లైన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే  ఆన్‌లైన్‌లో లేకపోతే ఓటు లేనట్టేనని అధికారులు వారికి చెబుతున్నారు. ఇంట్లో ఇంకెవరిదైనా ఓటరు కార్డు నంబర్‌ చెబితే బీఎల్‌ఓ నంబర్‌ ఇస్తాం.. కాల్‌ చేసి మాట్లాడండని సూచిస్తున్నారు. బీఎల్‌ఓలకు కాల్‌ చేస్తే .. ఇప్పుడేం చేయలేమని, ఎన్నికలు అయ్యాక మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు.  గతంలో ఓట్లు వేసిన వారితో పాటు గతేడాది కొత్తగా దరఖాస్తు చేసుకొని ఓటరు కార్డులు వచ్చిన వారిలోనూ ఇలాంటి సమస్య తలెత్తింది. దీనిపై అధికారులు పట్టించుకోవడంలేదు. ఎంపీ, అసెంబ్లీ..  ఏ ఎన్నికైనా ఓటర్లకు సరిగా స్లిప్పులు చేరడంలేదు. దీంతో ఓటు ఏ పోలింగ్‌ బూత్‌లో ఉందో తెలుసుకోలేక కొందరు పోలింగ్‌ రోజు కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో  కొందరు ఓటు వేయకుండా నే వెనక్కి వెళ్లి పోతుంటారు. ప్రతి ఎన్నికల్లో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నా కూడా ఓటర్‌ స్లిప్పుల వందశాతం పంపిణీపై అధికారులు పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. ఆన్‌ లైన్‌లో చూస్తే కనిపించడం లేదు. ఓటర్‌ స్లిప్‌ లు రావడం లేదు. చివరకు తమ ఓటు ఉందా లేదా అనేది కూడా తెలుసుకోలేకపోతున్నామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటేసేందుకు వీటిలో ఏదైనా ఒకటి ఉంటే చాలని అధికారులు అంటున్నారు. వాటిలో ఆధార్‌ ,పాస్‌పోర్ట్‌,.డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫొటోతో ఉన్న సర్వీస్‌ ఐడెంటిటీ కార్డ్‌
బ్యాంకు పాస్‌బుక్‌, పాన్‌ కార్డు,  ఆర్‌జీఐ ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డు, జాబ్‌ కార్డు, హెల్త్‌ కార్డు, పింఛన్‌ డాక్యుమెంట్‌, ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు కార్డు, రేషన్‌, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌,  ఫ్రీడమ్‌ ఫైటర్‌ కార్డు, ఆర్మ్స్‌ లైసెన్స్‌ కార్డు, దివ్యాంగ సర్టిఫికెట్‌, లోక్‌ సభ, రాజ్యసభ మెంబర్‌ ఐడెంటిటీ కార్డు, పట్టదారు పాస్‌ బుక్‌లలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. ఇదిలావుంటే  ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సిటీలో పోలింగ్‌ శాతంపైనే అధికారులు దృష్టి పెట్టారు. ఈసారి పోలింగ్‌ నవంబర్‌ 30న గురువారం వచ్చింది. దీంతో పోలింగ్‌ పర్సంటేజ్‌ పెరగవచ్చని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
అయితే.. ఐటీ ఎంప్లాయీస్‌ ఎంత మంది ఓటేస్తారనేది ఆసక్తిగా మారింది. పోలింగ్‌ సందర్భంగా గురువారం అధికారికంగా సెలవు ప్రకటించారు. ఆ తర్వాత రోజు శుక్రవారం మినహాయిస్తే శని, ఆదివారాలు సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు వీకెండ్స్‌.  అంటే.. శుక్రవారం లీవ్పెట్టుకుంటే వరుసగా నాలుగురోజులు కలిసివస్తాయి. దీంతో టూర్‌ ప్లాన్‌ చేసుకునే వీలుంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగులకు కూడా శని, ఆదివారాలు సెలవులు. కాగా.. వీరు కూడా ఓటింగ్‌ కు దూరంగా ఉండే చాన్స్‌ ఉండొచ్చని తెలుస్తుంది. ఏ ఎన్నికైనా.. సిటీలో పోలింగ్‌ పర్సంటేజ్‌ తక్కువగా నమోదవుతుంది. ఐటీ కారిడార్‌ లో సుమారుగా 7 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటారు. చాలా మందికి ఇక్కడ ఓటు హక్కు లేదు. 30 నుంచి 40 శాతం మంది సొంతూళ్లలోనే ఓటు హక్కు ఉందని చెబుతుంటారు. ఐటీ ఉద్యోగాల్లో 25 శాతం మంది ఇతర రాష్టాల్ల్రో నుంచి వచ్చినవారైతే, 75 శాతం తెలుగు రాష్టాల్రవారే నివసిస్తుంటారు. ఇందులో హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన, స్థిరపడిన వారు 40 శాతం ఉంటారు. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా వీరిలో 10 శాతం మంది  కూడా ఓటు వేయడంలేదు. దీంతో సిటీ అంతటా చూస్తే ఐటీ కారిడార్‌ లోనే తక్కువ పోలింగ్‌ శాతం నమోదవుతుంది. ఈసారైనా వేస్తే ఓటింగ్‌ శాతం పెరుగుతుంది. లేకపోతే ఎప్పటిలానే తక్కువగా నమోదయ్యేలా ఉంది. జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ, ఎంపీ ఇలా ఏ ఎన్నికైనా.. సిటీలో బస్తీల్లో మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్‌ తక్కువగానే నమోదవుతుంది. ప్రతిసారి ఎన్నికల్లో తగ్గుతున్న పోలింగ్‌ శాతం తగ్గతుంది. పోలింగ్‌ డేను లీవ్‌ గా చూస్తుండగా.. సిటీ ఓటర్లు పోలింగ్‌?రోజు నుంచి వరుస సెలవులు వచ్చాయంటే ఇక అంతే.! 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అదే జరిగింది. పోలింగ్‌ డే ను సెలవుగా భావిస్తున్న వారు టూర్లకు వెళ్తూ ఓటు వేయడాన్ని విస్మరిస్తున్నారు. పోలింగ్‌ రోజున ఓటు హక్కును వినియోగించుకునేందుకే సెలవు రోజును ప్రకటిస్తారు. కానీ దాన్ని ఎంజాయ్‌ మెంట్‌ కోసం వాడుకుంటున్నారు. సిటీలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఓటర్లలో చైతన్యం కల్పించామని అధికారులు చెబుతున్నప్పటికీ  ఫలితం కనిపించడంలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  50 శాతంలోపే నమోదైంది. 2020 లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.71  శాతం నమోదైంది.  ప్రధానంగా బస్తీల జనాలే ఓటేసేందుకు ముందుకొస్తుండగా, జూబ్లీ హిల్స్‌, బంజారాహిల్స్‌ వంటి కొన్ని ప్రాంతాల్లో నివసించే వారు ఓటు వేయడానికి ఆసక్తి చూపించడంలేదు.