చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్‌

slider58రియో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళగా రికార్డు
హైదరాబాద్‌,ఏప్రిల్‌18  : జిమ్నాస్టిక్‌లో  దీపా కర్మాకర్‌ చరిత్ర సృష్టించింది. రియోలో జరిగే ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డెకెక్కింది. బ్రెజిల్‌లో ఆగస్టులో జరిగే మహావేడుకలకు దీపా అర్హత సాధించింది. దీపా వయసు 22 ఏళ్లు. త్రిపురలోని అగర్తలా ఆమె స్వస్థలం. గతంలో ఆమె కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలను గెలుచుకుంది. గత ఏడాది జరిగిన ప్రపంచ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ పోటీల్లో అయిదోవ స్థానంలో నిలిచింది. రియో డిజానరోలో జరిగిన క్వాలిఫై  ఈవెంట్‌లో దీపా అమోఘ ప్రదర్శన కనబరిచింది. మహిళల ఆర్టిస్టిక్‌ కేటగిరీలో ఆమె తొలి నాలుగు సబ్‌డివిజన్‌ పోటీల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆ ఈవెంట్‌లో ఆమె 52.698 పాయింట్లు సాధించింది. అయితే మిగతా మూడు ఈవెంట్ల తర్వాతే ఆమె తుది స్థానాన్ని ప్రకటిస్తారు. తొలి వాల్ట్‌ ప్రొడునోవాలో దీప అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రొడునోవా స్టంట్‌లో ఆమె 15.066 పాయింట్లు సాధించింది. ఆ పోటీల్లో పాల్గొన్న 14 మంది అథ్లెట్లలో ఆమే టాప్‌గా నిలిచింది. రెండు చేతుల విూద డబుల్‌ జంప్‌ చేసే ఈ ఈవెంట్‌ జిమ్నాస్టిక్స్‌ లో అత్యంత కష్టమైందిగా భావిస్తారు. కానీ ప్రొడునోవా స్టంట్‌ను దీపా మాత్రం ఈజీగా చేసేసింది. అయితే అన్‌ఈవెన్‌ బార్‌ ఈవెంట్లో ఆమె సరిగా పర్ఫార్మ్‌ చేయలేకపోయింది. ఆ ఈవెంట్‌లో ఆమెకు కేవలం 11.700 పాయింట్లు స్కోర్‌ చేసింది. బీమ్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజుల్లో దీపాకు 13.366, 12.566 పాయింట్లు వచ్చాయి. ప్రొడునోవా ఈవెంట్‌లో అమోఘ సత్తా చాటిన దీపా రియోకు అర్హత సాధించినట్లు జిమ్నాస్ట్‌ అధికారులు వెల్లడించారు. మిగతా దేశాల జిమ్నాస్ట్‌లకంటే దీపా ముందు ఉందని, 52.689 స్కోర్‌ సాధించిన ఆమె రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు అంతర్జాతీయ రిఫరీ దీపక్‌ ఖర్గా తెలిపారు. ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్‌ పోటీల్లో ఇప్పటివరకు భారత్‌ కు చెందిన 11 మంది పురుషులు మాత్రమే ఆ కేటగిరీలో పోటీపడ్డారు. అయితే తొలిసారి మహా

క్రీడా వేదికపై భారతీయ మహిళా జిమ్నాస్టిక్‌ ప్రదర్శన చేయనుంది. వుమెన్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్ట్‌ కేటగిరీలో రియోకు ఎంపికైన వ్యక్తిగత అథ్లెట్లలో దీపా 79వ స్థానంలో నిలిచింది.దీంతో దీపా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తొలి ఇండియన్‌ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. దీపా కర్మకార్‌ 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పథకం సాధించింది.