చరిత్ర సృష్టించిన భారత్‌

-ఆసిస్‌ గడ్డపై కోహ్లీసేన డబుల్‌ ధమాకా
– మెల్‌బోర్న్‌ చివరి వన్డే భారత్‌ ఘన విజయం
– 2-1తో వన్డే సిరీస్‌ నెగ్గిన కోహ్లిసేన
– హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్న ధోని, జాదవ్‌
– మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ చహల్‌, సిరీస్‌ ధోని
మెల్‌బోర్న్‌, జనవరి18(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత టెస్టు సిరీస్‌ గెలిచిన టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్‌లోనూ ఘన విజయం సాధించింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్టేల్రియాతో శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో మహేంద్రసింగ్‌ ధోని (87), కేదార్‌ జాదవ్‌ (61) అజేయ అర్ధశతకాలు బాదడంతో భారత్‌ జట్టు 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకున్న కోహ్లీసేన సగర్వంగా కంగారూల గడ్డపై పర్యటనని ముగించింది. ఈ సిరీస్‌కి ముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమవగా.. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
మెల్‌బోర్న్‌లో జరిగిన చివరి వన్డేలో టాస్‌ గెలిచిన టీమిండియా ఆస్టేల్రియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.. దీంతో ఆదిలోనే భారత బౌలర్లు చెలరేగడంతో ఆస్టేల్రియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ వికెట్ల పతనంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆస్టేల్రియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ధాటికి ఓపెనర్లు కారే (5), ఫించ్‌ (14) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మార్ష్‌, ఖవాజా ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 73పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం చాహల్‌ షో ప్రారంభమైంది. చాహల్‌ ధాటికి ఖవాజా (34), షాన్‌ మార్ష్‌ (39), హండ్స్‌కాంబ్‌ (58), స్టోయిన్స్‌ (10), రిచర్డ్సన్‌ (16), జంపా (8) పెవిలియన్‌ చేరారు. కెరీర్‌లో మొదటి సారి ఆరు వికెట్లు దక్కించుకుని చాహల్‌ సత్తా చాటాడు. ఇక, మ్యాక్స్‌వెల్‌ (26), స్టాన్‌లేక్‌ (0) వికెట్లను షవిూ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆస్టేల్రియా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌లో హాండ్స్‌కాంబ్‌ (58) మాత్రమే అర్ధశతకం సాధించాడు. మిగిలిన వారిలో షాన్‌ మార్ష్‌ (39), ఖవాజా (34) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహల్‌ ఆరు వికెట్లు పడగొట్టగా, షవిూ, భువీ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. దీంతో ఆస్టేల్రియా 230 పరుగులకే ఆల్‌ఔట్‌ అయింది. 231 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు వన్డేల్లో రాణించిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. సిడిల్‌ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లితో శిఖర్‌ ధావన్‌ జట్టు స్కోర్‌ను 50 పరుగులు దాటించాడు. ఈ తరుణంలో శిఖర్‌ (23), స్టోయినిస్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన ఎంఎస్‌ ధోని వచ్చిరావడంతోనే మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ మ్యాక్సీ జారవిడచడంతో ధోని ఊపిరి పీల్చుకున్నాడు. ధోనితో కలిసి కోహ్లి ఆచితూచి ఆడుతూ.. మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. అనంతరం కోహ్లి(46) కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు.
ధోని ‘హ్యాట్రిక్‌’!
కేదార్‌ జాదవ్‌తో ధోని జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో ధోని 74 బంతుల్లో 3 ఫోర్లతో కెరీర్‌లో 70వ అర్థ సెంచరీతో ఈ సిరీస్‌లో హ్యాట్రిక్‌ సాధించాడు. తొలి రెండు వన్డేల్లో ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ అర్థసెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఎప్పటిలానే ఎలాంటి సంబరాలు లేకుండా మరుసటి బంతికి ధోని సిద్దమయ్యాడు. ఇక ధోనికి మద్దతుగా జాదవ్‌ కూడా ఆచితూచి ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్‌లో మూడో హాఫ్‌ సెంచరీ సాధించాడు. చివర్లో కొంత ఉత్కంఠ నెలకొనినా.. ధోని, జాదవ్‌లు బౌండరీలు బాదడంతో భారత్‌ నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో రిచర్డ్సన్‌, సిడిల్‌, స్టోయినిస్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఇక ఈ మ్యాచ్‌ ప్రారంభంలో వరణుడు కొంత టెన్షన్‌ పెట్టడంతో ఆటకు కాసేపు అంతరాయ కలిగింది. ఆరు వికెట్లతో చెలరేగిన చహల్‌కు మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ వరించగా.. సిరీస్‌లో హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించిన ధోనికి మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌ దక్కింది.